అయోధ్య రామమందిరం నిర్మాణంలో దేశంలోని ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కోరారు. జోగులాంబ గద్వాల జిల్లాకేంద్రంలో నిర్వహించిన శోభాయాత్రలో ఆమె పాల్గొన్నారు. గద్వాలలోని చెన్నకేశవ స్వామిగుడిలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరించారు.
అనంతరం ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర పట్టణంలోని పురవీధుల వెంట కొనసాగింది. యాత్రకు పోలీసులు అనుమతి లేదనడంతో కార్యకర్తలు రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వందల ఏళ్ల నుంచి నిలిచిపోయిన గుడి నిర్మాణం సుప్రీంకోర్టు తీర్పుతో ప్రారంభమైందని డీకే అరుణ తెలిపారు.