జోగులాంబ గద్వాల జిల్లాలో పురపాలక మంత్రి కేటీఆర్ నేడు పర్యటించనున్నారు. రూ.106 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో కొన్ని రోజులుగా విపక్షాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బందోబస్తులో భాగంగా పోలీసులు ముందస్తు అరెస్టులు ప్రారంభించారు.
ఈ క్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి... ఐజ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలంపూర్‌లోని నాయకులను, యువతను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. గద్వాల, అలంపూర్‌లోని ముఖ్య కార్యకర్తలను రాత్రి 12 గంటల నుంచే అరెస్ట్ చేసి నిర్భందించారు. ముందస్తు అరెస్టులు సరైనవి కావని... కాంగ్రెస్ శ్రేణులు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
2014 నుంచి పలుమార్లు గద్వాల నియోజకవర్గంలో పర్యటించిన కేటీఆర్, కేసీఆర్... ఇప్పటి వరకూ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తుమిళ్ల ఎత్తిపోతల, జూరాల ఆయకట్టు విస్తరణ, గుర్రంగడ్డ వంతెన, గట్టు ఎత్తిపోతల హామీలు నీటమూటలుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గద్వాల ప్రజల చిరకాల వాంఛ అయిన వైద్యకళాశాలను నేటి పర్యటనలో ప్రకటించాలని గద్వాల మాజీ ఎమ్మెల్యే భరత సింహారెడ్డి డిమాండ్ చేశారు. టెక్స్‌టైల్ పార్కు సహా శంకుస్థాపనలు చేసిన పనులను పూర్తి చేశాకే.. కేటీఆర్ జిల్లాకు రావాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ విమర్శించారు.
ఇదీ చూడండి: KTR: అక్టోబరులో తెరాస ప్లీనరీ.. అదే నెలలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం