జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని వివిధ ఆలయాలను రాష్ట్ర టూరిజం అధికారులతో కలిసి కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ డైరెక్టర్ మీనాక్షి శర్మ పరిశీలించారు. ప్రసాద్ పథకం ద్వారా రూ.37 కోట్లతో ఆలయాల పరిసరాల చుట్టూ చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు ప్రభుత్వానికి వివరించారు. తొలుత తుంగభద్ర నది వంతెన వద్ద గుర్తించిన ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలతో పాటు నవబ్రహ్మ ఆలయాలను సందర్శించారు.
ఆలయాల్లో భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ప్రసాద్ పథకం ద్వారా ఏర్పాటు చేయాలని మీనాక్షి శర్మ అన్నారు. రాష్ట్ర టూరిజం ఎండీ మనోహర్ రావు, టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శంకర్ రెడ్డితో చర్చించారు. తుంగభద్ర నదిలో బోటింగ్ ఏర్పాటు చేయాలని డైరెక్టర్ దృష్టికి ఆలయ ఈవో ప్రేమ్ కుమార్ తీసుకు వచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లను మీనాక్షి శర్మ దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయాల విశిష్టతను ఆలయ సిబ్బంది వివరించారు.
ప్రసాద్ పథకం ద్వారా ఆలయాల చుట్టూ పచ్చదనం, పార్కింగ్, శుద్ధ జలం, భక్తులు సేద తీరేందుకు ప్రత్యేక షెడ్డు, అన్నదాన సత్రం, విద్యుద్దీపాలు, ఆలయాల చుట్టూ అంతర్గత రోడ్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రాన్ని అమ్మలా కాపాడుకుంటా: గవర్నర్ తమిళిసై