జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతుంటే.. ఆయన ఎమ్మెల్యేలు.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు శ్రేణులను సంసిద్ధం చేస్తున్నారు.
- (ఇదేంటీ కొత్తగా.. ముందస్తు ఎన్నికల ముచ్చట ఇప్పుడెందుకు వచ్చింది..? పెద్దసారు కూడా ఎక్కడా మాటవరసకైనా చెప్పలేదే అని ఆలోచిస్తున్నారా..?)
కేంద్రం ఇబ్బందులు పెడుతుంటే.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసేలా.. రాష్ట్ర ప్రభుత్వ బలం నిరూపించుకునేందుకు.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిందే కదా..!
- (ఇదేక్కడి లాజిక్ అని మళ్లీ.. లెక్కలు వేస్తున్నారా..?)
అందుకోసమే కదా.. సీఎం కేసీఆర్ వనపర్తిలో మార్చి 10న బహిరంగ సభను కూడా నిర్వహించబోతున్నారు.
- (అవునా..!! ఈ ముచ్చట మాకు తెల్వదే అని అయోమయంలో పడ్డారా..?)
మీ మెదళ్లలో మెదిలే సందేహాలన్నింటికీ ఓ స్పష్టత రావాలంటే.. మీరు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం చెప్పిన ముచ్చట వినాల్సిందే..
"ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామని అందరికీ అర్థమైంది. కేంద్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో నడిచేందుకు చాలా మంది విపక్ష నేతలు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే దిల్లీలో చాలా మంది నేతలను కేసీఆర్ కలిశారు. రైతు సంఘ నేతలతో పాటు మాజీ మంత్రులు, మాజీ ప్రధానితో సైతం మాట్లాడారు. భారతదేశంలో ఉన్న ఇబ్బందుల గురించి ఎత్తిచూపే కార్యక్రమాల్లో కేసీఆర్ ఉన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ అవలంభించే వైఖరిపై సర్వత్రా వ్యతిరేకత వస్తోంది. రైతుల దగ్గరి నుంచి చాలా మంది కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టొచ్చు.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ఎదుర్కొనేందుకు ముందుస్తు ఎన్నికలకు వెళ్లి.. మన బలం నిరూపించాలనే ఉద్దేశంతోనే వనపర్తిలో సభ ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి పెద్దఎత్తున కార్యకర్తలు వచ్చి సభను విజయవంతం చేయాలి." - అబ్రహం, అలంపూర్ ఎమ్మెల్యే
వేదిక సరైందే.. నేపథ్యమే..
ఈ నెల 10న వనపర్తిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అందుకోసం అలంపూర్ నియోజకవర్గం నుంచి సభకు 10వేల మంది కార్యకర్తలను తరలించాల్సిన బాధ్యతను స్థానిక నేతలకు అధిష్ఠానం అప్పజెప్పింది. అయితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహం.. ఈరోజు(మార్చి 4న) పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. వనపర్తి సభకు కార్యకర్తలను సంసిద్ధం చేసేందుకు ఈ వేదికను ఎమ్మెల్యే వినియోగించుకున్నారు. సీఎం సభను ఎలాగైనా విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఇదంతా బాగానే ఉన్నా.. సభ నేపథ్యాన్ని మాత్రం తనదైన శైలిలో వివరించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు ఎమ్మెల్యే అబ్రహం. మరీ ఈ విషయం పెద్దసారు వరకు వెళ్తే.. రియాక్షన్ ఏంటనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.
ఇదీ చూడండి: