జీవితంలో ఒక్కసారైనా గుర్రం మీద స్వారీ(Horse Riding) చేయాలనేది అతడి కోరిక. కానీ ఆర్థిక స్తోమత లేక ఆ కల నెరవేర్చుకోలేకపోయాడు. ఈఎంఐతో ద్విచక్రవాహనం కొనుగోలు చేశాడు. ఇటీవల పెట్రోల్ ధరలు పెరగడంతో బండి అమ్మేశాడు. ఆ డబ్బులతో కడపకు వెళ్లి గుర్రాన్ని కొనుగోలు చేశాడు.
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన నర్సింహులు పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ద్విచక్రవాహనాన్ని అమ్మేశాడు. అప్పటి నుంచి ఎటువెళ్లినా గుర్రం(Horse Riding)పైనే. పెట్రోల్ ధరలు సామాన్యులకు అందనత్త పెరగడం వల్ల బండి అమ్మేశానని.. అందుకే గుర్రంపై వెళ్తున్నానని చెప్పారు. దీనివల్ల గుర్రంపై తిరగాలన్న తన చిన్ననాటి కల నెరవేరిందని అన్నారు.
చుట్టుపక్కల 50 కిలోమీటర్ల మేర ఏ అవసరం ఉన్నా గుర్రంపైనే వెళ్తున్నారు నర్సింహులు. రెండు సంవత్సరాల కిందట 22 వేల రూపాయలు పెట్టి కడప జిల్లా ప్రొద్దుటూరులో గుర్రాన్ని కొని అప్పటి నుంచి ఇప్పటి వరకు గుర్రంపైనే తిరుగుతుండటం వల్ల తన పేరు గుర్రం నరసింహులుగా మారిందని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల్లో గుర్రం నర్సింహులు అంటే తెలియని వారుండరు.