ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. శనివారం మరో 53 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇద్దరు మృతి చెందారు. ఫలితంగా జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 761కు చేరగా.. మృతుల సంఖ్య 30కి చేరింది.
మహబూబ్‌నగర్‌లో..
మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటి వరకు 269 కేసులు నమోదు కాగా.. శనివారం మరో 21 కేసులు నమోదయ్యాయి. ఇదివరకే 14 మంది చనిపోగా.. శనివారం మరో ఇద్దరు మృతిచెందారు. జిల్లా కేంద్రంలోని క్రిష్టియన్ కాలనీ, న్యూ ప్రేమ్ నగర్, శ్రీనివాస కాలనీ, శేషాద్రి నగర్, బీకేరెడ్డి కాలనీ, షాషాబ్‌గుట్ట, పాల్‌సాబ్‌గుట్ట, రామయ్యబౌళిలో ఒక్కొక్కరు.. మర్లులో మరో ముగ్గురు కొవిడ్ బారినపడ్డారు. జడ్చర్ల పట్టణంలో ఇద్దరు, హౌసింగ్‌బోర్డు కాలనీలో మరో ముగ్గురికి వైరస్ సోకింది. నవాబుపేట మండల కొత్తపల్లిలో ఓ మహిళ, దేవరకద్ర, రాజాపూర్ మండల కేంద్రాల్లో ఒక్కొక్కరు, అడ్డాకల్ మండలం కాటవరం తండాలో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణయింది.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండకు చెందిన వ్యక్తికి కరోనా నిర్ధారణ కాగా.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరన్నపేటకు చెందిన ఓ మహిళ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
జోగులాంబ గద్వాల జిల్లాలో
జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటి వరకు 125 కేసులు నమోదు కాగా.. శనివారం కొత్తగా 14 పాజిటివ్ కేసులు నిర్ధారణయ్యాయి. గద్వాల పట్టణంలోనే 11 కేసులు నమోదు కాగా.. మండల పరిధిలోని రేకులపల్లెలో ఒకరు, వడ్డేపల్లి మండలం రామాపురంలో ఒకరు కొవిడ్ బారినపడ్డారు.
వనపర్తి జిల్లాలో
వనపర్తి జిల్లాలో తాజాగా 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వనపర్తి పట్టణంలోని వల్లభనగర్ కాలనీలో భార్యాభర్తలు, పట్టణంలోని మరొకరు కొవిడ్ కోరల్లో చిక్కుకున్నట్లు జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు.
నాగర్‌కర్నూల్‌లో..
నాగర్‌కర్నూల్ జిల్లాలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన ఒక రైతుకు పాజిటివ్‌గా నిర్ధారణయింది. తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామ పరిధిలోని ఆర్సి తండాకు చెందిన ఓ వ్యక్తి వైరస్ బారినపడ్డాడు. ఇతడు భూత్పూర్‌లోని ఓ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి సుధాకర్‌లాల్ తెలిపారు.