YS Sharmila fires on CM KCR: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తరచూ రాష్ట్ర ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తున్న ఆమె తాజాగా మరోసారి సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ పలు ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా నెరవేర్చలేదని షర్మిల విమర్శించారు. మోసపూరితమైన మాటలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. బంగారు తెలంగాణ అని పేదవారికి బ్రతుకు లేని తెలంగాణ చేశారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ వర్గాన్ని ఆదుకొనే దిక్కు లేదని దుయ్యబట్టారు.
ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి చేరుకున్నారు. అక్కడ గ్రామస్థులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలోని చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె కేసీఆర్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి పథకాలు ఆయన చేసి చూపించారని అన్నారు.
వైఎస్ ఉన్నప్పుడు చేసిన 90% పథకాలు నేడు సక్రమంగా అమలుకాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చేముందు దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని మాయమాటలు చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తనను ఆశీర్వదిస్తే మళ్లీ ఆ పథకాలన్ని ప్రజలకు అందిస్తానని తెలిపారు.
వైఎస్సార్ హయాంలో లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చారన్న ఆమె.. 40 లక్షల పక్కా ఇల్లు కట్టించారన్నారు. వైఎస్సార్ ఉన్నప్పుడు ప్రతి గ్రామం కలకలలాడేదని.. పేదవాడి ఇంట్లో జబ్బు వస్తే ఆరోగ్య శ్రీ ఉందనే ధీమా ఉండేదని పేర్కొన్నారు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి చేసిన మంచి పని ఒకటైనా ఉందా అని ప్రశ్నించారు. మోసపూరిత మాటలతో ప్రజలను నమ్మిస్తున్న కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడాలని ప్రజలను వైఎస్ షర్మిల కోరారు.
ఇవీ చదవండి: