ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ పక్రియపై తహసీల్దార్లు పూర్తి అవగాహన పెంచుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో తహసీల్దార్లు, ధరణి ఆపరేటర్లకు పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణలో భాగంగా జిల్లా కలెక్టర్ దగ్గరుండి తహసీల్దార్లతో డమ్మీ రిజిస్ట్రేషన్లు చేయించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 25న దసరా పండుగ సందర్భంగా ధరణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. అమ్మకాలు, కొనుగోలు, మ్యూటేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్లైన్లోనే... నిర్ణీత తేదీ, సమయం తెలియజేయాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూచించిన మేరకు తహసీల్దార్లు ముందస్తు ప్రయోగాత్మకంగా డమ్మీ రిజిస్ట్రేషన్లు చేసి ధరణి పోర్టల్ పూర్తి స్థాయిలో పని చేసే విధంగా అవసరమైన సామగ్రిని సమకూర్చుకోవాలని, ఆన్లైన్లో భూముల రిజిస్ట్రేషన్ కోసం ఆపరేటర్ల మీద ఆధారపడకుండా తాహసీల్దార్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్పకుండా పెంచుకోవాలన్నారు.
ధరణి సేవలలో అంతరాయాలు ఏర్పడకుండా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, సాంకేతిక ప్రతినిధులతో నిరంతరం సంప్రదిస్తూ ధరణి పోర్టల్ సేవలు అందించేందుకు తహసీల్దార్లు సిద్ధంగా ఉండాలన్నారు. భూముల రిజిస్ట్రేషన్లలో ఎలాంటి తప్పులు జరగకుండా రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్లు, ధరణి ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.