వచ్చే ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ గెలుపు బావుటా మొదట భూపాలపల్లి గడ్డ మీదే ఎగరనుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. భూపాలపల్లిలో నిర్వహించిన 'ప్రజా గొంతుకకు ప్రణామం' సభ(congress meeting)లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. గండ్ర సత్యనారాయణకు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. సత్యనారాయణతో పాటు ఆయన అనుచరగణాన్ని సాదరంగా ఆహ్వానించారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు రెండు పర్యాయాలు కేసీఆర్‌ను సీఎంను చేస్తే.. రాష్ట్రానికి చేసిందేమిటని రేవంత్(revanth reddy speech latest) నిలదీశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు.. పార్టీని చావు బతుకుల్లో పెట్టి రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియాగాంధీ చేసిన తప్పేంటని ప్రశ్నించారు. సోనియాగాంధీ లేకపోతే.. ఒంటరిగా సీఎం కేసీఆర్ వల్ల తెలంగాణ సాధ్యమయ్యేదేనా..? అని నిలదీశారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని.. నరేంద్రమోదీ ఆనాడు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.
గుండెల మీద తన్ని...
"ఈ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి గెలిపిస్తే.. అందరి గుండెల మీద తన్ని గండ్ర వెంకటరమణారెడ్డి మోసం చేశిండు. తన భార్యకు జిల్లాపరిషత్ ఛైర్మన్ పదవి రావటం కోసం ఆత్మాభిమానాన్ని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో తాకట్టుపెట్టిండు. ఇద్దరు ఉద్దెర వ్యక్తులు.. ఒకరు ఎమ్మెల్యే, ఇంకొకరు జిల్లాపరిషత్ ఛైర్పర్సన్ అయ్యిండ్రు. ఇసుక ఎక్కడున్నా.. బొగ్గు ఎక్కడున్నా.. భూమి ఎక్కడున్నా.. ఫంక్షన్హాళ్లున్నా.. గండ్ర వెంకటరమణారెడ్డి ఉంటడు. వందేళ్ల నుంచి పేదోళ్లు.. దున్నుకుంటూ జీవనం సాగిస్తుంటే.. వాటి మీద కూడా గండ్ర కన్ను పడింది. ఇక నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. ఇదే ఆఖరి ప్రజా జీవితం."- రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
మీకు అండగా నేనుంటా...
"తెరాసది నక్సలైట్ల ఎజెండా అని కేసీఆర్ చెప్పిండు. మరి ఏ నక్సలైట్ల ఎజెండాలో.. కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులు ఇవ్వాలని రాసుంది. తెలంగాణ గడ్డ మీద రక్తం చిందొద్దు.. తుపాకీ తుటాలు పేలొద్దన్న కేసీఆర్.. తెరాస ప్రభుత్వం వచ్చాక ఎన్కౌంటర్లు చేయలేదా.. ఈ బిడ్డలు నేలకొరగలేదా..? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారు. వారి కుటుంబాల కళ్లల్లో దుఃఖం, ఆవేదన నిండిపోయింది. ప్రశ్నించే గొంతుకలను అక్రమంగా అరెస్టులు చేసి.. దొర వారి అన్యాయాలను ప్రశ్నించకుండా చేస్తున్నారు. కొంత మంది పోలీసులు.. కాంగ్రెస్ కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెడుతున్నారు. అలాంటి పోలీసులందరి పేర్లను డైరీల్లో రాసుకుంటాం. తెలంగాణ క్రియాశీల రాజకీయాల్లో 20 ఏళ్లుంటా. రాబోయే రోజుల్లో వాళ్లందరికీ మిత్తితో సహా చెల్లించుకుంటాం. కష్టాలకోర్చి అన్ని వేళలా కాంగ్రెస్ జెండాను మోస్తున్న కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మాది. ఇప్పుడు కాంగ్రెస్ కుటుంబంలో చేరిన సోదరులను కలుపుకొని కార్యకర్తలంతా.. అహర్నిశలు కష్టపడి గండ్ర సత్యనారాయణ రావును అసెంబ్లీకి పంపించే బాధ్యత మీది. మీ సమస్యల మీద కొట్లాడే బాధ్యత మాది. "- రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
సభకు వచ్చిన కార్యకర్త మృతి..
భూపాలపల్లి సభకు హాజరైన కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. కాల్వ శ్రీరాంపూర్ నుంచి వచ్చిన మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ గుండెపోటుతో మరణించాడు. మరణించిన కార్యకర్త కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్‌రెడ్డి ప్రగాడ సానుభూతి ప్రకటించారు. బాధితుని కుటుంబానికి రూ.3 లక్షలు పరిహారం ప్రకటించారు.
ఇదీ చూడండి: