జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో స్వామి వారిని భక్తులు దర్శించు కుంటున్నారు. కరోనా మహమ్మారి వ్యాధి నేపథ్యంలో సుమారు రెండు నెలల తర్వాత శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ ద్వారలు తెరుచుకున్నాయి. భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించిన అనంతరం స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఆలయ అధికారులు స్వామి వారికి ఆర్జిత సేవలను రద్దు చేశారు. ప్రత్యేక పూజలు సైతం నిలిపి వేశారు. కేవలం దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు.
ఆలయ పరిసరాలను సిబ్బంది నిత్యం శానిటైజ్ చేస్తున్నారు. భౌతిక దూరం పాటించేలా గుర్తులు, నియమాలను సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రతీ భక్తుడు చేతులు, కాళ్లు శుభ్రం చేసుకున్న తర్వాత థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష చేశాకే.. ఆలయంలోకి పంపిస్తున్నారు. 60 ఏళ్లకుపై బడిన వృద్ధులను, 10 ఏళ్లలోపు పిల్లలు, అనారోగ్య సమస్యలున్న వారిని దర్శనానికి అనుమతించడం లేదు.
లాక్డౌన్ తర్వాత తొలిసారిగా ఆలయాలు తెరుచుకున్నప్పటికి భక్తులు తక్కువ సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఆలయాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చూడండి: తీవ్ర ఉత్కంఠ.. ముఖ్యమంత్రి నిర్ణయం కోసం ఎదురుచూపు