జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జిల్లా అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్ కార్యదర్శి రఘునందన్ రావు, ఇతర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో చేపట్టనున్న ఏడో విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో నాటడానికి ఆరు నెలల క్రితం నుంచే గ్రామ పంచాయతీ నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయడం జరిగిందని సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు.
ప్రజలు అడిగిన మొక్కలు అందివ్వాలి..
ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే మొక్కల నాటేందుకు అన్ని ఏర్పాట్లను చేసుకోవాలని అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ ఆశించిన విధంగా ప్రతి ఇంటికి... వారు అడిగిన 6 మొక్కలను అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అలాగే ఈసారి రహదారులకు ఇరువైపులా మొక్కలను నాటి సంరక్షించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. నర్సరీల నుంచి మొక్కలను రవాణా చేసేటప్పుడు మొక్కలు పాడవకుండా చూసుకోవాలని తెలిపారు. వర్షాలు ప్రారంభం అయినందు వల్ల గ్రామాల్లో శానిటేషన్ డ్రైవ్ నిర్వహించి గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అన్నారు.
30 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు..
ఏడో విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా జిల్లాలో 30 లక్షల మొక్కలను నాటేందుకు మండలాలు వివిధ శాఖల వారీగా లక్ష్యాలను నిర్ణయించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ వైవీ గణేష్ తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి హరితహారం కార్యక్రమం ఏర్పాట్లపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు గ్రామ పంచాయతీలను, మున్సిపాలిటీలను సిద్ధం చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి పురుషోత్తం, జడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి