జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టులకు పేలుడు పదార్థాలు, కరపత్రాలు, తదితర సామగ్రి తరలిస్తుండగా ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మహాముత్తారం మండలం గుత్తికోయగూడెం శివారు ప్రాంతంలో శనివారం ఉదయం ఎస్సై శ్రీనివాస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించిన వారిని ప్రశ్నించగా.. పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని వెంబండించి పట్టుకొని తనిఖీ చేయగా జిలెటిన్ స్టిక్స్ , డిటోనేటర్లు, టిఫిన్ బాక్సులు, కరపత్రాలు లభించాయి. నిందితులు మడకం నందు, మడకం మహేష్, మడకం కమలేష్, పోడియం లింగయ్య, మడకం భద్రయ్యలను కాటారం సీఐ హాథీరాం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
వారి వద్ద నుంచి రెండు డిటోనెటర్లు, రెండు జిలెటిన్ స్టిక్స్, రెండు టిఫిన్ బాక్సులు, 10 మావోయిస్టు కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయా వ్యక్తులు చత్తీస్గఢ్ రాష్ట్రం, ఇతర ప్రాంతాల నుంచి గుత్తికోయగూడెంకు వలసవచ్చారని, నిషేధిత మావోయిస్టు పార్టీ మహదేవపూర్- ఏటూర్ నాగారం దళంకు నేతృత్వం వహిస్తున్న కంకణాల రాజిరెడ్డికి ఈ సామగ్రి అందించడానికి వెళ్తుండగా పట్టుబడినట్లు కాటారం డీఎస్పీ బోనాల కిషన్ తెలిపారు. గ్రామాల్లో మావోయిస్టులకు ప్రజలెవరు సహకరించవద్దని, అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్