.
మేడారం అటవీ ప్రాంతంలో చిన జాతర కోలాహలం మొదలైంది. గత ఆదివారం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో మేడారానికి తరలివస్తున్నారు. పెద్ద జాతరకు రాలేని భక్తులు.. ఈ చిన జాతరకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా సమ్మక్క సారలమ్మలను భావించడం ఆనవాయితీ. అందుకే జాతర సమయాల్లో వచ్చి పూజలు చేసి బెల్లాన్ని కానుకగా సమర్పించుకుంటారు.
పెద్ద జాతర జరిగిన మరుసటి సంవత్సరం మాఘ శుద్ధ పౌర్ణమి దాటిన తరువాత వచ్చే బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు చిన జాతర నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. అమ్మవారి ఆలయాలను శుద్ధి చేసి పూజలు నిర్వహిస్తారు. జాగారాలు చేస్తారు.
గత పది సంవత్సరాల నుంచి చిన జాతరకు సైతం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈసారి నాలుగు నుంచి ఐదు లక్షల వరకూ భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు.వాహనాల రద్దీ పెరిగితే ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. మేడారానికి వెళ్లే దారిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.