కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆరో ప్యాకేజీ పనుల అంచనా వ్యయం రూ.1,469 కోట్లు పెరిగింది. ఈ మేరకు సవరించిన అంచనా వ్యయం రూ.6,709 కోట్ల మేర ప్రతిపాదనలను నీటిపారుదల శాఖకు ప్రాజెక్టు ఇంజినీర్లు సమర్పించారు. గతంలో ఈ పనుల అంచనా రూ.5,240 కోట్లుగా ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నందిమేడారం పంపుహౌస్ వరకు ఆరో ప్యాకేజీ కిందికి వస్తుంది. ఎల్లంపల్లి నుంచి 2.58 కిమీ అప్రోచ్ కాలువ 1.10 కిమీ గ్రావిటీ కాలువ, 9.53 కిమీ జంట సొరంగాలు.. 7 పంపులతో నిర్మించిన భూగర్భ పంపుహౌస్ పనులు దీని పరిధిలో ఉన్నాయి.
స్టాండింగ్ కమిటీ ఆమోదం
ఎలక్ట్రికల్ పనుల భూసేకరణకు సంబంధించిన వ్యయాలను గతంలో అంచనా వ్యయంలో కాకుండా ప్రత్యేకంగా చూపారు. మేడారం, వేములూరు గ్రామాల పరిధిలో 4.885 ఎకరాల వరకు భూసేకరణ చేపట్టారు. ఇవన్నీ కలిపి తాజా సవరణ అంచనాలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అన్నారం బ్యారేజి పనులకు మరోసారి సవరించిన అంచనా వ్యయం రూ.2,795 కోట్లకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. మొదటి అంచనా వ్యయం రూ1,785 కోట్లు.
టెండర్ ప్రక్రియ ద్వారానే..
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలో వట్టెం జలాశయంలో బిగించాల్సిన ల్యాబ్ ఎక్విప్మెంట్ను నామినేషన్ విధానంలో కాకుండా.. టెండర్ ప్రక్రియ ద్వారానే కొనుగోలు చేయటానికే కమిటీ మొగ్గు చూపింది. రూ.1.10 కోట్ల విలువ గల ఈ పరికరాలను వట్టెం జలాశయంతో పాటు.. ఈ ఎత్తిపోతల పథకంలోని జలాశయాల్లోనూ బిగించే అవకాశాలు ఉన్నాయి. భీమా ఎత్తిపోతల పథకంలోని 27 ప్యాకేజీ పనులు పూర్తి చేసేందుకు గుత్తేదారుకు గడువు పెంచుతూ కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి: ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలి తీసుకున్న ప్రమాదం