రాష్ట్ర వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో మేడిగడ్డ బ్యారెజీ ద్వారా నీటిని నిల్వ చేసి కన్నేపల్లి పంపుహౌస్ వద్ద మోటార్లతో ఎత్తిపోస్తున్నారు. ఇప్పుడు మేడిగడ్డలో 35 గేట్లు మూసివేసి నీటిని నిల్వచేస్తుండగా... కన్నేపల్లి పంపుహౌస్ లో 1,6 వ నెంబర్ మోటార్ పంపులను నడిపిస్తూ నీటిని ఎత్తిపోస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి స్మిత సబర్వాల్ కన్నెపల్లి పంపుహౌస్ మూడవ మోటారును ఇవాళ ప్రారంభించారు. అనంతరం మోటార్లు పనిచేస్తున్న తీరును, నీటిని ఎత్తిపోస్తున్న పరిస్థితులపై ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు. కన్నెపల్లి పంపుహౌస్ ద్వారా ఎత్తిపోస్తున్న నీరు సుమారు 14 కి.మీ గ్రావిటీ కాల్వ ద్వారా ప్రవహించి అన్నారం బ్యారెజీ వద్దకు చేరుతుంది. కన్నేపల్లిలోని ఒక్కో మోటర్ 60 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తి పోస్తుండగా... ఇప్పటి వరకు అన్నారం బ్యారెజీ వద్దకు 2 టీఎంసీల నీరు చేరింది. కార్యక్రమంలో సీఎంఓ కార్యదర్శి వెంట నీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు , సీఎంవో ఓఎస్డీ దేశ్ పాండే, మెగా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: విజయాల సారథి.. శతకాల వారధి..ఈ సవ్యసాచి!