తెలంగాణలోని అన్ని భూముల్లో కాళేశ్వరం జలం పరుగులు పెట్టేందుకు అదనపు టీఎంసీ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేందుకు సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్‌లో అదనపు టీఎంసీ మోటార్ల పనులు ఊపందుకోనున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో తీవ్ర జాప్యం జరిగిన మోటార్ల బిగింపు ప్రక్రియ గురువారం ఈటల, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ రాకతో వేగవంతం కానున్నాయి.
జులై లక్ష్యంగా పనులు..
అదనపు టీఎంసీ పనులను వేగవంతం చేసి వచ్చే వానాకాలం కల్లా జలాలను ఎత్తిపోయాలనే లక్ష్యంగా పనులు చేస్తున్నారు. జులై కల్లా పనులు పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నారు. లక్ష్మీ పంపుహౌస్‌లో ఇప్పటికే 11 మోటార్లను పూర్తి స్థాయిలో అమర్చి పంపులను నడిపిస్తున్నారు. దీంతో 2 టీఎంసీల పనులు విజయవంతమయ్యాయి.
వరుస క్రమంలో 1 నుంచి 11 వరకు మోటార్లను నడిపించి గ్రావిటీ కాలువ ద్వారా గోదావరి జలాలను అన్నారం సరస్వతి బ్యారేజీకి తరలిస్తున్నారు. మరో టీఎంసీ పనులను సత్వరమే పూర్తి చేయాలని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించగా సంస్థ ప్రతినిధులు, కాళేశ్వరం బ్యారేజీ ఇంజినీర్లు దృష్టి సారించారు. సివిల్ పనులతో సిద్ధమవుతున్నారు.
త్వరలోనే మోటార్ల దిగమతి
మూడో టీఎంసీ పనుల కోసం అదనంగా 6 మోటార్లు బిగించాల్సి ఉంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన ఆరు మోటార్లు రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఆస్ట్రియా, ఫిన్లాండ్, చైనా, ఇటలీ, తదితర దేశాల నుంచి మోటార్లతో పాటు ఇతర విడిభాగాలు, సామగ్రి కూడా రావాల్సి ఉంది. 40 మెగావాట్ల సామర్థ్యం కల్గిన మోటార్లు రావడమే తరువాయి అమర్చేందుకు గతంలోనే సివిల్ పనులన్నీ పూర్తి చేశారు.
ఇంపెల్లర్ బిగింపు
పంపుహౌస్‌లోని 12వ మోటారును అమర్చేందుకు ఇంపెల్లర్‌ను ఇంజినీరింగు అధికారులు బిగించారు. మంత్రి ఈటల రాజేందర్, స్మితాసబర్వాల్ గురువారం పనులను పరిశీలించారు. 13వ నంబర్ మోటార్‌కు సంబంధించి ఇప్పటికే దిగుమతి చేసుకోగా క్షేత్ర స్థాయికి చేరుకుంది. మిగతా 4 మోటార్లకు సంబంధించి పైపుల అమరిక పూర్తయ్యి ఇంపెల్లర్ల బిగింపుకు సిద్ధంగా ఉంది. కరోనా కష్టకాలంలోనూ కాళేశ్వరం పనులను చేయిస్తున్నారు. సకాలంలో పనులన్నీ పూర్తిచేస్తే రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్ఛు.