జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొవిడ్-19 కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న క్రమంలో అనుమతి లేకుండా ఎలాంటి శుభకార్యాలు నిర్వహించవద్దని జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు స్పష్టం చేశారు. కొద్దిరోజులుగా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజలు విధిగా మాస్కులు ధరించాలని, మాస్కు నిబంధన ఉల్లంఘించిన వారిపై ఇప్పటికే 201 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.
పెళ్లిళ్లు సహా అన్ని రకాల శుభకార్యాలు, చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన కార్యాలకు సైతం విధిగా అనుమతి తీసుకోవాలని శ్రీనివాసులు తెలిపారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా కేవలం 50 మందికి లోబడి మాత్రమే శుభకార్యాలు నిర్వహించుకోవాలని, తప్పనిసరిగా సంబంధిత డీఎస్పీ కార్యాలయాల నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.