ప్రధాన రహదారి అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో జిల్లా పాలనాధికారి రెవెన్యూ, సింగరేణి, జెన్కో, మున్సిపల్, నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమావేశం నిర్వహించి ప్రధాన రహదారి అభివృద్ధిపై సమీక్షించారు. జిల్లాలో భారీ వాహనాలు అధికంగా ప్రయాణించే మార్గాల్లో రహదారి త్వరగా దెబ్బతింటోందని కలెక్టర్ తెలిపారు. భారీ వాహనాలు ప్రయాణించే రహదారిపై ప్రత్యేకమైన రుసుమును వసూలు చేసి, ఆ రుసుము ద్వారా రహదారి అభివృద్ధి పనులు చేపట్టేందుకు త్వరలోనే జిల్లా అధికారులతో కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా మార్గదర్శకాలను రూపొందించి చర్యలు చేపడతామన్నారు.
భూపాలపల్లి పట్టణంలో ప్రధాన రహదారిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా చెల్పూర్ నుంచి బాంబులగడ్డ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా పూల మొక్కలు నాటి సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ ఐలాండ్స్, స్వాగత తోరణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, సింగరేణి, జెన్కో సహకారంతో నిర్ణయించిన విధంగా పనులు జరగాలని అన్నారు.
ఇవీ చూడండి: ప్రభుత్వం చెప్పిన పంటలు సాగు చేస్తేనే రైతుబంధు, మద్దతు ధర