భూపాలపల్లి జిల్లాలోని కేటీకే-3 లాంగ్‌వాల్‌తో పాటు మణుగూరులోని కొండాపూర్ గని, కేకే-5, కాసిపేట-2, శాంతిఖని కంటిన్యూస్ మైనర్ శిలాఫలకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. కానీ వాటికి సంబంధించిన పనుల్లో ఆలస్యమైంది. ఇప్పుడు పనుల్లో వేగం పెంచేందుకు దృష్టి సారించారు. వీటితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుండాల, రాంపూర్ భూగర్భ బొగ్గు గనులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసింది. కొత్తగా ములుగు ప్రాంతంలో ఉన్న బ్లాక్‌లను గనుల కోసం ప్రతిపాదనలు చేశారు.
ప్రణాళికలు రూపొందించారు
జిల్లాలోని మహదేవ్‌పూర్ ప్రాంతం చండ్రుపల్లిలో భూగర్భ గనిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. తాజాగా భద్రాది కొత్తగూడెం జిల్లాలోని గుండాల, రాంపూర్ గనులకు సైతం ప్రణాళికలు పూర్తి చేయడంతో మరిన్ని ఆశలు చిగురిస్తున్నాయి. చాలా కాలంగా ప్రారంభానికి ఎదురు చూసిన కాసిపేట-2 భూగర్భ బొగ్గు గనిలో పనులు ప్రారంభమయ్యాయి. కొండాపూర్‌లో బొగ్గు ఉత్పత్తి చేపడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బొగ్గు ఉత్పత్తి అధికంగా చేపట్టేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది.
రెండు గనుల్లో వేగం
ప్రతిపాదనలో ఉన్న రెండు భూగర్భ బొగ్గు గనుల కోసం ప్రణాళికల రూపకల్పనలో వేగం పెంచారు. గుండాల గనికి సంబంధించిన నివేదికలను తయారు చేశారు. 18 ఏళ్ల జీవిత కాలం ఉండే ఈ గనిలో 7.5 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు గుర్తించారు. బీ, సీ గ్రేడు బొగ్గు నిల్వలున్న ఈ గనికి సంబంధించిన అనుమతులను సాధ్యమైనంత తొందరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. దీంతో పాటు రాంపూర్ గని జీవిత కాలం 31ఏళ్లు ఉంటుంది. ఇందులో 36.62 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. ఈ రెండు గనులతో పాటు భూపాలపల్లి కేటీకే 5లాంగ్‌వాల్, కేకే-5, ములుగు ప్రాంతంలోని గనులకు సంబంధించిన ప్రతిపాదనలు పూర్తి చేసింది. వాటికి సంబంధించిన అనుమతులు పొందేందుకు యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నిస్తోంది.
ఇదీ చూడండి : సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి