ములుగు జిల్లా రామానుజవరం, వెంకటాపురం మండలం వెల్తుర్లపల్లి గ్రామాల మధ్యలో చెంచుకాలనీ సమీపంలోని ఓ గుట్టను పరిశోధకులు గుర్తించారు. దీనిని తొలచి రామప్ప దేవాలయం, గణపురం కోటగుళ్లు, రామానుజపురం పంచకూటాలయానికి ఉపయోగించారని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సీఈఓ ఈమని శివనాగిరెడ్డి, వరంగల్‌కు చెందిన చరిత్ర పరిశోధకుడు అరవింద్ ఆర్య తెలిపారు.
తొలచిన ఆనవాళ్లు..
ఈ రాతి గనులు 13వ శతాబ్దం నాటివని పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లాలోని ఘనపురం కోటగుళ్లు, ఆ పక్కనే రెడ్డిగుడిని పరిశీలించడానికి శివనాగిరెడ్డి, అరవింద్ ఆర్య వెళ్లారు. సమీపంలోని రాతి గుట్ట ప్రాంతంలో అన్వేషణ జరిపారు. 'దాదాపు కి.మీ. మేర ఉన్న గుట్టను ఆలయ కట్టడాలకు కావాల్సిన రీతిలో ఉలులతో తొలచిన ఆనవాళ్లను గుర్తించాం. క్రీ.శ.1213లో నిర్మించిన రామప్ప దేవాలయం, క్రీ.శ.1254లో నిర్మించిన ఘనపురం కోటగుళ్లు.. ఇలా పలు ఆలయాలకు అవసరమైన ముడిరాయిని ఈ రాతి గుట్ట నుంచే సేకరించి శిల్పాలు చెక్కారు’' అని శివనాగిరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
నేటికీ ఉన్నాయి:
‘రాళ్లను గుట్టనుంచి విడగొట్టడానికి అడుగున్నర పొడవు, రెండు అంగుళాల వెడల్పు, అంగుళం మందం కలిగిన ఇనుప గూటాలను దిగేసిన గుర్తులు నేటికీ ఉండటం ఆశ్చర్యకరం’ అని ఆయన పేర్కొన్నారు. వీటిని మరింత పరిశీలిస్తే ఇంకా ఎన్నో ఆనవాళ్లు దొరికే అవకాశం ఉందని వారు చెప్పారు.
ఇదీ చూడండి: ఎన్టీఆర్ జీవితంపై పుస్తకం.. ఆవిష్కరించనున్న ఉపరాష్ట్రపతి