Kaleshwaram water flow: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతోంది.కాళేశ్వరం వద్ద వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోందని కేంద్ర జలసంఘం వెల్లడించింది. కాళేశ్వరం వద్ద నీటిమట్టం 107.56 మీటర్లకు చేరిందన్న కేంద్ర జలసంఘం... కాళేశ్వరం వద్ద వరద పెరిగే అవకాశం ఉందని తెలిపింది. మేడిగడ్డ బ్యారేజీకి 22లక్షల 15వేల 760 క్యూసెక్కుల వరద చేరుతుండగా... బ్యారేజీ అన్ని గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.
మేడిగడ్డ బ్యారేజ్ వద్ద అంతకంతకూ వరద ప్రవాహం పెరుగుతోంది. కంట్రోల్ రూమ్, సీఆర్‌పీఎఫ్ కార్యాలయాన్ని వరద చుట్టుముట్టింది. అన్నారం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 14లక్షల 77వేల 975 క్యూసెక్కులుగా ఉంది. మహాదేవపూర్, కాళేశ్వరం గోదావరి పరివాహక ప్రాంతంలో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. పుష్కర ఘాట్లను వరద నీరు ముంచెత్తి ఇళ్లలోకి నీరు చేరింది. భారీ వరదతో నివాస ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు. కాళేశ్వరం ఘాట్ వద్దకు ఎవరూ రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 15.900 మీటర్ల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది
గోదావరి పరివాహక ప్రాంతాల్లో రెడ్‌అలర్ట్: మహాదేవపూర్, కాళేశ్వరం గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధికారులు రెడ్‌అలర్ట్ ప్రకటించారు. పుష్కరఘాట్లను ముంచెత్తిన వరదనీరు సమీప ఇళ్లలోకి చేరింది. భారీ వరద దృష్ట్యా ముంపు నివాసాలను అధికారులు ఇప్పటికే ఖాళీ చేయించారు. మహదేవపూర్ పరిధి గోదావరి తీర ప్రాంతాలు జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. అన్నారం, చండ్రుపల్లి, నాగపల్లి, మద్దులపల్లి, పల్గుల, కుంట్లం, కన్నెపల్లి, బీరాసాగర్ గ్రామాలు జలమయమయ్యాయి. ఏటూరునాగారంలో శివాలయం వీధి, ఓడవాడలోకి వరద వచ్చి చేరింది. బెస్తవాడ, ఎస్సీ కాలనీ, కుమ్మరివాడ, దామెరకుంట, లక్ష్మీపూర్, గుండ్రాత్‌పల్లి, మల్లారం వరద గుప్పిట్లోనే చిక్కుకున్నాయి. వరద ఉద్ధృతికి రాకపోకలు నిలిచిపోయి బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి సహాయచర్యల కోసం ముంపు బాధితులు ఎదురుచూస్తున్నారు.