జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం ఓపెన్ కాస్ట్ పరిధిలో రైతులకు తీరని అన్యాయం జరిగిందని కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఏఐఎఫ్బీ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణ రావు ఆరోపించారు. రైతులతో కలిసి గణపురం ప్రధాన రహదారి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా గణపురంలో 318, 200, 106 సర్వే నెంబర్లలో సుమారు ఏడువేల ఎకరాలకు పట్టాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు బినామీలుగా ఏర్పడి భూములను వారి పేర్లపై అక్రమ పట్టాలను చేయించుకుంటున్నారని వాటిని తక్షణమే రద్దు చేయాలని గండ్ర డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలను పరిష్కరించక పోతే ఊరుకునేది లేదన్నారు. గత సంవత్సర కాలంగా రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హులైన రైతులకు పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ పాలకుర్తి మాధవికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గండ్ర పద్మ, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు, సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కలెక్టరేట్ వద్ద తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం