భూపాలపల్లి పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలని మున్సిపల్ అధికారులను జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. ఇళ్లల్లో తడి, పొడి చెత్తను ప్రతిరోజు సేకరించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. వెంటనే వార్డుల్లో సిబ్బందిని కేటాయించి శానిటేషన్ ఆటో రిక్షాల ద్వారా వేరుగా సేకరించాలన్నారు.
పకడ్బందీగా..
భూపాలపల్లి మున్సిపాలిటీలో అపరిష్కృతంగా ఉన్న శానిటేషన్ పనులు పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపొందించేందుకు రెగ్యులర్ నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తున్నందున పకడ్బందీగా చేపట్టాలని పేర్కొన్నారు.
శానిటేషన్ ఆటో రిక్షాలో చెత్త వెయ్యకుండా రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వేసే ఇంటి యజమానులకు ఫైన్ వేయాలని సూచించారు. పన్నుల వసూళ్లలో మున్సిపాలిటీ వెనుకంజలో ఉన్నందున బిల్ కలెక్టర్లను బాధ్యులుగా చేస్తూ 100% వసూలు చేయించాలన్నారు.
వెనక్కి రప్పించాలి..
పారిశుద్ధ్య కార్మికులను నియమించడంతో పాటు ఇతర మున్సిపాలిటీలకు డిప్యుటేషన్‌పై వెళ్లిన అధికారులు, సిబ్బందిని వెనక్కి రప్పించాలని తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా చేపట్టిన వైకుంటదామాలు, షెగ్రిగేషన్ షెడ్లు, చెత్త డంపింగ్ యార్డ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యాపారులకు లైసెన్సులు అందించాలని సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, టీపీబీఓ అవినాష్, ఏఈ రాజన్న, టెక్నికల్ అధికారి మానస, కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్, రజిత, వివిధ సెక్షన్ల అధికారులు, బిల్లు కలెక్టర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కేటీఆర్ ఆదేశాలు: అంశాల స్వామికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు