Kishan Reddy Bhupalapally Tour: కరోనా నాలుగో దశ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలంతా మళ్లీ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వివాహ వేడుకలు, సమావేశాలు... ఇలా ఎక్కడకు వెళ్లినా మాస్కులు ధరించాలని... నాలుగో దశ నియంత్రణలో ప్రజల సహకారం చాలా ముఖ్యమన్నారు. ఇవాళ భూపాలపల్లిలో ఆయన పర్యటిస్తున్నారు.
డోసుల ప్రకారం... ఇంకా టీకాలు వేయించుకోని వారు వెంటనే వేయించుకోవాలని సూచించారు. ఐదు సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల పిల్లలకూ త్వరలోనే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇవాళ భూపాలపల్లికి వచ్చిన కేంద్రమంత్రి... రేగొండ మండలం ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలను సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. దేశంలో విద్య, వైద్యం, ఉపాధి పరంగా ఆస్పిరేషన్ జిల్లాలుగా గుర్తించిన చోట్ల మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని.. అందులో భాగంగా దేశంలో అన్ని చోట్ల కేంద్రమంత్రులు ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు.
తెలంగాణలో భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, అసిఫాబాద్ జిల్లాలను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. రేగొండ పీహెచ్సీలో ప్రజలకు వైద్యసేవలు కార్పొరేట్ ఆసుపత్రిలో బాగా అందుతున్నాయంటూ ప్రశంసించారు. అంతకుముందు కిషన్‌రెడ్డి... రూపిరెడ్డిపల్లిలో రామాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ భవేశ్ మిశ్రా, హుజూరాబాద్ శాసనసభ్యుడు ఈటల రాజేందర్, అధికారులు, భాజపా నేతలు పాల్గొన్నారు.
వెనకబడిన జిల్లాలను అభివృద్ధి చేయాలనేది ప్రధాని లక్ష్యం. ప్రధాని ఆదేశాలతో దేశవ్యాప్తంగా వెనకబడిన జిల్లాలను గుర్తించారు. రాష్ట్రంలో భూపాలపల్లి, భద్రాద్రి, అసిఫాబాద్ జిల్లాలను గుర్తించారు. వెనకబడిన జిల్లాల్లో కేంద్రమంత్రులు పర్యటిస్తున్నారు. కార్పొరేట్ తరహాలో ఇక్కడ వైద్య సేవలు అందుతున్నాయి. కరోనా నాలుగో ఉద్ధృతి దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి. కరోనా దృష్ట్యా ప్రజలందరూ మాస్కులు ధరించాలి. కరోనా కట్టడిలో ప్రజల సహకారం ఎంతో అవసరం.
-- కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
అనంతరం రావులపల్లి శివారులోని పాండవులగుట్టను సందర్శించి అటవీ శాఖ, జిల్లా అధికారులతో పర్యాటక రంగ అభివృద్ధిపై చర్చించారు. ప్రాంత అభివృద్ధితో పాటు ప్రజలకు పర్యాటక రంగంపై అవగాహన పెంచాలని అధికారులకు కిషన్ రెడ్డి సూచించారు. తర్వాత ఘనపురం మండలం చెల్పూర్ కేటీపీపీ గోదావరి గెస్ట్‌హౌస్‌లో జిల్లా కలెక్టర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వచ్చే ఎన్నికల్లో తెరాసకు పీకే సేవలు.. సరికొత్త ప్రచారానికి ప్రణాళికలు..!