జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని మైలారం గ్రామం నుంచి మహారాష్ట్ర నాందేడ్‌కు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని శనివారం సాయంత్రం పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు క్రైమ్ అండ్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జి. మోహన్ సిబ్బందితో కలిసి అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మైలారం నుంచి శనివారం సాయంత్రం లారీ నెంబర్ టీఎస్ 16 యూబీ 5334 ద్వారా బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకొని లారీలో ఉన్న బియ్యాన్ని పరిశీలించగా పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
గణపురం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి షేర్ల తిరుపతిని విచారించగా గత కొద్ది రోజుల నుంచి రేగొండ మండలంలోని రామన్న గూడెం, బాగిర్తిపేట తదితర గ్రామాల్లో ప్రజల నుంచి బియ్యం తక్కువ ధరకు సేకరించి, ఎక్కువ ధరకు మహారాష్ట్రలోని గోండియా ప్రాంతానికి తరలిస్తున్నట్లు తెలిపారు.
మైలారం నుంచి సరఫరా చేస్తున్నటువంటి 250 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం సుమారు విలువ రూ. 6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అదేవిధంగా బియ్యం తరలిస్తున్న లారీ డ్రైవర్ బాక్ శంకర్, క్లీనర్ కేశవ్‌లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: మందు లేని మాయదారి రోగం కరోనా.. అంటూ పాటతో అవగాహన