కరోనా ఉద్ధృతి పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాత్రి పూట కర్ఫ్యూ నేటి నుంచి అమలు చేస్తున్నట్లు భూపాలపల్లి డీఎస్పీ ఏ.సంపత్రావు తెలిపారు. రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, థియేటర్లు, దుకాణాలు, మద్యం దుకాణాలు, హోటల్స్, బార్లు, రెస్టారెంట్ల మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. కర్ఫ్యూ నుంచి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, అత్యవసర సేవలు, పెట్రోల్ బంకులు, మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆస్పత్రులు, ఈ-కామర్స్ సేవలు, ఆహార పదార్థాల పంపిణీ, గోడౌన్లకు మినహాయింపు ఇచ్చారన్నారు. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే రోగులకు ఎలాంటి ఆంక్షలు ఉండవని, అంతర్రాష్ట్ర రవాణాకు ఎలాంటి అనుమతులు అవసరంలేదని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు.
రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలతో పాటు కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రజలు, వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకులు, ఉద్యోగులు, అన్ని వర్గాల వారు పోలీసులతో సహకరించి కరోనా వ్యాధి నివారణకు తోడ్పడాలని డీఎస్పీ సంపత్ రావు కోరారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ