రైతువేదికలు, వైకుంఠధామల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించి.. రైతువేదికలు, వైకుంఠధామాల నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదికలు, వైకుంఠధామాల నిర్మాణాలు జిల్లాలో ఆశించిన మేరకు వేగంగా జరగడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతిరోజు అన్ని ప్రదేశాలను పరిశీలించి వేగంగా పని జరిగేలా చూడాలన్నారు. నిర్మాణ ప్రగతిని ఫొటోల ద్వారా ప్రతిరోజు అందించాలని సూచించారు. అదేవిధంగా రైతు వేదికలు, వైకుంఠధామాలతో పాటు పల్లెప్రకృతి వనాల ఏర్పాటు పనుల వ్యయాన్ని ఏ రోజుకారోజు ఆన్లైన్లో బుక్ చేయాలన్నారు.
వైకుంఠధామాలను అటవీ భూముల్లో నిర్మించేందుకు అనుమతులు ఉన్నందున ప్రభుత్వ భూమి అందుబాటులో లేని గ్రామాల్లో అటవీ భూముల్లో నిర్మించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే గుర్తించి వైకుంఠధామాల నిర్మాణాలు ప్రారంభించని చెరువు శిఖం భూములు, వివాదంలో ఉన్న భూములు, సరైన రహదారి లేని భూముల స్థానంలో వేరే భూములను గుర్తించుటకు వెంటనే ఆయా మండలాల తహసీల్దార్లకు లేఖలు రాయాలని కృష్ణ ఆదిత్య ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ రాంబాబు, డీఈలు సాయిలు, వెంకటేశ్వర్లు, ఆత్మారాం, ఏఈలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పండ్ల తోటల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం : కలెక్టర్