జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్స్‌లో రూ.30 కోట్ల విలువైన స్త్రీనిధి చెక్కులను లబ్ధిదారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా నిలబడేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని మంత్రి వెల్లడించారు.
తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆరేనని కొనియాడారు. కల్యాణలక్ష్మి పథకం అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్, సుల్తానియా, జిల్లా పాలనాధికారి నిఖిల, రాష్ట్ర స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు.