Show Cause Notice Issued: మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కాంగ్రెస్ రాజకీయ శిక్షణ తరగతుల్లో జరిగిన రసాభసపై పీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ చిన్నారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డితోపాటు ఎఎంసీ మాజీ ఛైర్మన్ ఎరమల్ల సుధాకర్, మాజీ కౌన్సిలర్ మేడే శ్రీనివాస్‌లకు.. చిన్నారెడ్డి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. పార్టీ గీత దాటి వ్యవహరించడంపై ఈ నెల 29 లోపు వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించారు.
ఏం జరిగిందంటే..
ఈ నెల 9, 10వ తేదీల్లో కొంపల్లిలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతులకు హాజరయ్యేందుకు పాస్‌లు ఇవ్వలేదని జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డితో పాటు మరికొందరు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌నే దీనికి కారణమంటూ ఆరోపించారు. శిక్షణ తరగతుల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా పెద్దగా కేకలు వేస్తూ దుర్భాషలాడారు. రేవంత్ సర్ది చెప్పేందుకు యత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇందుకు సంబంధించి వీడియోలను, ఇతర ఆధారాలను పరిశీలించిన క్రమశిక్షణ కమిటీ వారికి షోకాజ్ నోటీసులు (show cause notice issued to congress leaders) ఇచ్చింది. ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే.. సీనియర్ నేతలను సంప్రదించి పరిష్కరించుకోవాలని.. అంతేగానీ క్రమశిక్షణ మరిచి ఇతరులు బురదజల్లేలా చేసుకోవద్దని హెచ్చరించింది.
ఇదీ చూడండి: Revanth Reddy: 'మనం కొట్టుకోవడం కాదు.. తెరాస, భాజపాలపై మన ప్రతాపాన్ని చూపిద్దాం'