జనగామ జిల్లాలో వరి ధాన్యం విక్రయించుకునేందుకు రైతులు అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు ఆలస్యం కావడంతో దళారులకు విక్రయించి మోసపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ఎదురుచూడాల్సి రావడంతో గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు.
ఈ ఏడాది జిల్లాలో వర్షాలు అధికంగా కురవడంతో వరి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పల్లెల్లో కొనుగోలు కేంద్రాలు లేక ధాన్యం రాశులు పేరుకుపోతున్నాయి. కొందరు రైతులు మార్కెట్ కేంద్రాలకు తరలించినా అమ్మకాలు జరగకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేసి రైతన్నలను ఆదుకోవాలని కోరుతున్నారు.