జనగామ జిల్లా కేంద్రంలోని చంపక్‌హిల్స్ వద్ద ఉన్న మాతా, శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. కాన్పు సమయంలో అవసరమైన మెడికల్ కిట్లు, మందులు ఆసుపత్రి ఫార్మసీలో లేకపోవడంతో బయటి మెడికల్ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నామని.. స్కానింగ్ సౌకర్యం అందుబాటులో లేక ప్రైవేటు కేంద్రాలకు వెళ్తున్నామని బాలింతలు, గర్భిణుల సహాయకులు మంత్రి ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ఇక్కడి మందుల దుకాణంలో కనీసం దగ్గు, జ్వరం, జలుబు తదితరాల ఔషధాలు కూడా లేవని మంత్రి ఎదుట పలువురు వాపోయారు.
దీంతో ఎంసీహెచ్ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్‌రాజు, ఇతర వైద్యులపై మంత్రి హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణకు ఫోన్ చేసి.. జనగామ ఎంసీహెచ్‌లో ఔషధాలు, మెడికల్ కిట్ల కొరత ఎందుకు ఉందని ప్రశ్నించారు. వాటిని తక్షణమే అందుబాటులో ఉంచాలని ఆదేశించగా.. వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటామని కమిషనర్ బదులిచ్చారు. పని తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య సిబ్బందిని మంత్రి హెచ్చరించారు.
దాదాపు అరగంట పాటు ఆరోగ్య కేందాన్ని పరిశీలించి పలు సమస్యలను చూసిన తర్వాత మంత్రి ఆగ్రహంతో వెళ్లిపోయారు. ఈ విషయమై మాట్లాడమని విలేకరులు కోరగా.. ‘ఇంకేం మాట్లాడాలి.. మీ డాక్టర్లనే అడగండి’ అంటూ వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చూడండి..