Kadiyam Srihari latest news : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో జరిగిన గిరిజనోత్సవానికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ప్రశసించారు. గిరిజనుల రిజర్వేషన్లు ఆరు శాతం నుండి పది శాతం వరకు పెంచడమే కాకుండా, గిరిజన పిల్లలకు విద్య కోసం గురుకులాలను ఏర్పాటుచేశారన్నారు. నూతనంగా ఏర్పడిన తండా గ్రామపంచాయతీలకు సొంత భవనాలను నిర్మించిన ఘనత బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని కొనియాడారు.
స్టేషన్ ఘనపూర్‌లో అవినీతి పెరిగిపోయిందని, ఈ అవినీతిని మీరు ఇచ్చిన ఖడ్గంతో అంతమొందించే బాధ్యత తనపై ఉందన్నారు. ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇచ్చినప్పుడు ప్రజల అభివృద్ధికై పని చేయాలి తప్ప.. డబ్బులు దండుకోవడం కాదని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదం తనపై ఉండాలని, స్టేషన్ ఘనపూర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉత్తర కుమారునితో సమానమని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆదివాసీల రిజర్వేషన్ల పెంపు, గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు ముందుకు రావట్లేదని మండిపడ్డారు. రాష్ట్రంపై కాంగ్రెస్, బీజేపీలు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని కడియం ధ్వజమెత్తారు. సన్నాసులు, దద్దమ్మల మాటలు విని మోసపోవద్దు.. మరోసారి బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేసి కేసీఆర్‌కే పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడే ధర్మసాగర్, జాఫర్ఘడ్, స్టేషన్‌ఘన్‌పూర్‌లోని తండాలకు రోడ్లు వేశానని గుర్తు చేశారు. ఇప్పటికీ అనేక తండాల్లో రోడ్లు లేకపోతే 11 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించానన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తనపై భుజాలపై ఉందని పేర్కొన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో తెలంగాణ అమరుడు భోజ్యా నాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
"స్టేషన్ ఘనపూర్‌లో అవినీతి పెరిగిపోయింది. ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇచ్చినప్పుడు ప్రజల అభివృద్ధికై పని చేయాలి తప్ప.. డబ్బులు దండుకోవడం కాదు. రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదం కావాలి. స్టేషన్ ఘనపూర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం. తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. రాష్ట్రంలో మరోసారి గులాబీ జెండా రెపరెపలాడాలి. బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేసి కేసీఆర్‌కు పట్టం కట్టాలి". - కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ
ఇవీ చదవండి: