Retired MPDO Ramakrishnaiah Murder in Jangaon District : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన విశ్రాంత ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య హత్యకు గురైనట్లు సమాచారం కలకలం సృష్టిస్తోంది. గురువారం రోజున అపహరణకు గురైన రామకృష్ణయ్య మృతదేహాన్ని శనివారం జనగామ మండలంలోని చంపక్ హిల్స్ అటవీ ప్రాంతంలోని నీటి గుంటలో గుర్తించినట్లు తెలిసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తన తండ్రిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఆయన కుమారుడు అశోక్ శుక్రవారం బచ్చన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుమారు 30 మంది అనుమానితులను పోలీస్టేషన్‌కు పిలిపించి విచారించారు. బచ్చన్నపేట, జనగామ జిల్లా పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఐదు బృందాలుగా విడిపోయి గాలించాయి. నిందితులుగా భావిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు, మరికొందరి కోసం గాలిస్తున్నట్లు సమాచారం.
ఆయన కుమారుడు అశోక్, కుటుంబ సభ్యులు శనివారం ఉదయం జనగామలో మాట్లాడుతూ.. అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతోనే తన తండ్రి అపహరణకు గురయ్యారని ఆరోపించారు. కృష్ణయ్య 15 ఏళ్ల కిందట జనగామ జిల్లా రఘునాథపల్లి ఎంపీడీవోగా పని చేస్తూ ఉద్యోగ విరమణ పొందారు. పలువురు వ్యక్తులకు సంబంధించిన భూ వివాదాలపై రెవెన్యూ అధికారులకు తరచూ ఫిర్యాదులు చేస్తుండే వారని వారు తెలిపారు. ఈ క్రమంలో పలు వివాదాలకు సంబంధించి లోకాయుక్తతో పాటు సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులను వివరణ కోరేవాడని, ఈ ఘటనలతో ఆయనపై పలువురు కక్ష పెంచుకున్నట్లు తెలిపారు. కాగా రామకృష్ణయ్య మృతిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కేసును నిష్పక్షపాతంగా విచారణ చేస్తామని, కేసు విచారణలో ఉండగా ఎలాంటి వివరాలు ఇప్పుడే వెల్లడించలేమని జనగామ డీసీపీ సీతారాం తెలిపారు.
'కేసులో ఎలాంటి పురోగతి లేదు. పోలీసులు ఎటువంటి లీడ్లు సంపాదించలేదు. ఈ కేసులో వారు చాలా నిర్లక్ష్యం చేశారు. మా నాన్న కిడ్నాప్‌నకు గురి కావడంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాత్ర ఉంది. వారి మద్దతుతో గిరిబోయిన అంజయ్య, గూడా సిద్దిరెడ్డి, కట్టు మల్లయ్య, సతీష్ రెడ్డి వీళ్లంతా కలిసి మా నాన్నను కిడ్నాప్ చేసినట్టు అనుమానిస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతోనే ఇదంతా జరిగింది. ఎస్సై నవీన్ కుమార్, సీఐ నాగబాబు వీళ్లకు కూడా తెలుసు. వీరు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించి ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకుండా చేస్తున్నారు. అన్నింటికీ మమ్మల్నే వెతుక్కోమంటున్నారు. పూర్తిస్థాయి నిర్లక్ష్యం మమ్మల్ని తీవ్రంగా బాధపెడుతుంది. దీనికి సంబంధించి సీపీ గారితో హోం మంత్రికి నివేదించాను. వారు చర్యలు తీసుకుంటామని తెలిపారు.'-అశోక్, మృతుని కుమారుడు
ఇవీ చదవండి: