Inauguration of Sri Rama Temple at Valmidi : భద్రాద్రి తరహాలో అభివృద్ధి చేసిన జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడిలో శ్రీ సీతారామ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రిదండి చిన్న జీయర్ స్వామి.. సీతారామ లక్ష్మణులు హనుమంతుడి విగ్రహ ప్రతిష్టాపన చేశారు.
రాష్ట్రప్రభుత్వం 25 కోట్ల రూపాయల వ్యయంతో వల్మిడి గుట్టపై.. సీతారాముల దేవాలయాన్ని పునర్నిర్మించారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. దేవాలయానికి విచ్చేసిన త్రిదండి చిన్న జీయర్ స్వామికి మంత్రులు.. ఎర్రబెల్లి దయాకర్‌రావు సాదరంగా స్వాగతం పలికారు. ఈ ఉత్సవంలో మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
Valmidi Ramalayam Jangaon : వల్మిడి రామాలయం.. ఎర్రబెల్లి చొరవతో రామయ్యకు పునర్వైభవం
విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ.. తెలంగాణ పరిపాలకులకు భగవంతుడిపై భక్తి భావం ఎక్కువ.. అందుకే రాష్ట్రంలో ఏ లోటులేకుండా పాలన సాగుతోందని పేర్కొన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే దేవాలయాల అభివృద్ధి జరిగిందని.. ధూప దీప నైవేద్యాలకు లోటు లేకుండా చేస్తున్నామన్నారు.
వాల్మీకి నడియాడిన నేల ఇది అని.. రాముడి పాదాలు ఇక్కడ ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. భద్రాచలం, అయోధ్య తరహా చరిత్ర ఈ ఆలయానికి ఉందని తెలిపారు. దయాకర్‌రావు ఆలయానికి పూర్వ వైభవం తెచ్చారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారుత. ముఖ్యమంత్రి కేసీఆర్ గుండెల నిండా భక్తి భావం కలిగిన నేత అని అందుకే ఆధ్యాత్మికత రాష్ట్రంలో వెళ్లి విరుస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేలకు పైగా దేవాలయాల్లో.. ధూప దీప నైవేద్యాలు కొనసాగుతున్నాయని, అనేక ఆలయాల అభివృద్ధి జరుగుతోందని కొనియాడారు.
"వాల్మిడిలో ఇంత పెద్ద స్థాయిలో ఆలయం నిర్మించడం నిజంగా శుభపరిణామం. తెలంగాణ పరిపాలకులకు భగవంతుడిపై భక్తి భావం ఎక్కువ.. అందుకే రాష్ట్రంలో ఏ లోటు లేకుండా పాలన సాగుతోంది." - త్రిదండి చిన్నజీయర్ స్వామి
"వాల్మీకి నడియాడిన నేల ఇది. రాముడి పాదాలు ఇక్కడ ఉన్నాయి, భద్రాచలం, అయోధ్య తరహా చరిత్ర ఈ ఆలయానికి ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన వెంటనే ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేశారు. ఇక్కడ భక్తుల సౌకర్యార్ధం అన్ని వసతులను ఏర్పాటుచేశాము". - ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి
"గుండెల నిండా భక్తి భావం కలిగిన నేత కేసీఆర్.. అందుకే ఆధ్యాత్మికత రాష్ట్రంలో వెళ్లి విరుస్తోంది. ఏడు వేలకు పైగా దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అనేక ఆలయాలను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు". - హరీశ్‌రావు, మంత్రి
Valmidi Ramalayam Jangaon : భద్రాద్రిని తలపించేలా వల్మిడి రామాలయం..