జనగామ జిల్లా పెంబర్తి హస్త కళాకారుల నైపుణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న ఈ గ్రామ కళాకారుల ఖ్యాతి ఇప్పటికే దేశం నలుమూలలా వ్యాపించింది. విదేశాల్లోనూ పెంబర్తి కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తోంది. ఇంట్లోనూ.. ఆలయాల్లోనూ ఉండే దేవుని ప్రతిమలనే సర్వాంతర్యామిగా.. పవిత్రంగా భావించి పూజలు చేస్తారు. ఆ దేవుని రూపాలు తయారు చేయడంలో పెంబర్తి కళాకారులు సిద్ధహస్తులు. వేములవాడ రాజన్న కోవెలలో వెండి ద్వారాలు, బాసర సరస్వతీ దేవి విగ్రహం.. శ్రీకాళహస్తి ఆలయ ధ్వజస్తంభానికి గల తొడుగ వీరు రూపొందించిందే.
యాదాద్రీశుని సేవలో..
ఇకపై పెంబర్తి కళాకారులు యాదాద్రీశుని సేవలో తరించనున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహాలు కూడా వీరి చేతుల్లోనే రూపుదిద్దుకుంటున్నాయి. యాదాద్రి పునర్నిర్మాణ ఆలయంలో పెంబర్తి హస్తకళ వైభవం దశదిశలా వ్యాపించనుంది. ఈ మేరకు కళాకారులతో స్వయంగా మాట్లాడిన ముఖ్యమంత్రి గర్భాలయం ప్రధాన ద్వారాలకు వెండి, బంగారు తాపడాలు, గర్భాలయం లోపల మూర్తులకు వెండి తొడుగులు, ప్రాకారం చుట్టూ రెయిలింగ్, రాజగోపురంపై ఇత్తడి రాగితో శంఖుచక్రాలు, పద్మాల నిర్మాణ పనులు వీరికి అప్పగించారు. తమకు అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి.. తెలంగాణ, పెంబర్తి ఖ్యాతిని మరింత ఇనుమడింపచేసేలా.. పనిచేస్తామని తెలిపారు.
నిజాం కాలం నుంచే పేరు ప్రఖ్యాతులు..
పెళ్లిళ్లల్లో... కాళ్లు కడుగే తాంబూలాలు, దీపపు కుందులు, ఇత్తడి చెంబులు, గ్లాసులు, కాకతీయ కళాతోరణం, నెమలి, హంస ఆకృతులు, పూలకుండీలు అందంగా తయారు చేయడంలో వీరికి వీరే సాటి. సన్మానాలు, సత్కారాల్లో ప్రముఖులకు ఇచ్చే జ్ఞాపికలు వీరి సృష్టేయ పెంబర్తిలోని ప్రతి ఇల్లు హస్తకళలకు కాణాచే. లోహపు ముద్దను కరిగించి లోకానికి అపురూప కళాఖండంగా పరిచయం చేస్తారు. వారస్వతంగా అబ్బిన హస్తకళా నైపుణ్యంతో కళాకృతులకు ప్రాణం పోసి మన ముందుంచుతారు. నిజాం నవాబుల పాలనకు ముందే ఇక్కడ విశ్వకర్మ కుటుంబీకులు వంట పాత్రలను రూపొందించేవారు. కాలక్రమేణా వంటింటి పాత్రల నుంచి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా అద్భుత కళ ఖండాలు సృష్టిస్తూ గ్రామ కీర్తిని నలుచెరగులా వ్యాపింపచేశారు. ప్రస్తుతం 50 కుటుంబాలు ఈ వృత్తిలో కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి : 'రాష్ట్రానికి 10 లక్షల టన్నుల యూరియా కేటాయింపు'