CM KCR Speech at Jangaon Praja Ashirwada Sabha : అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే.. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జిల్లాలో మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పాటుకు ముందు కొన్ని జిల్లాలకు వెళ్తే తనకు ఏడుపొచ్చేదని.. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల పరిస్థితి చూస్తే దీనంగా ఉండేదని కేసీఆర్ గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో బచ్చన్నపేటకు వెళ్తే.. ఊరిలోని యువకులంతా పొట్ట చేతపట్టుకుని వలస వెళ్లారని తెలిసిందన్నారు. ఇప్పుడు బచ్చన్నపేట చెరువులో 365 రోజులూ నీళ్లు ఉంటున్నాయన్న కేసీఆర్.. జనగామ జిల్లాలో ఇక కరువు అనేదే కనిపించదని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో జనగామ అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
BRS Public Meeting in Jangaon : ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో మనది అగమ్య గోచర పరిస్థితని కేసీఆర్ పేర్కొన్నారు. ఆర్థిక నిపుణులను పిలిపించి.. రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. ఎంతో మేథోమధనం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించామన్నారు. రాష్ట్ర రైతులు ఇప్పుడిప్పుడే దారినపడ్డారన్న ఆయన.. రైతులకు తమ భూమిపై పూర్తి హక్కులు ఉండాలనే ధరణి తెచ్చామని వివరించారు. అన్నదాతల కష్టాలు తెలుసు కాబట్టే రెవెన్యూ అధికారుల అధికారాలు రైతు చేతిలో పెట్టానన్నారు. రైతు వేలిముద్ర లేకుండా భూమి జోలికి ఎవరూ పోలేరని చెప్పారు.
ధరణిని తీసేసి బంగాళాఖాతంలో వేస్తామని విపక్షాలు అంటున్నాయని పేర్కొన్న కేసీఆర్.. రైతుల మీద అధికారులను మళ్లీ రుద్దాలని చూస్తున్నాయని ఆరోపించారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. సాగుకు 3 గంటల కరెంట్ చాలంటున్న కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపిస్తే.. 93 లక్షల మందికి కేసీఆర్ బీమా అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. రైతుబీమా తరహాలోనే వ్యక్తి చనిపోతే వారంలోనే రూ.5 లక్షలు వస్తాయని తెలిపారు. ఈ క్రమంలోనే ఓటు మన తలరాతను మార్చేస్తుందని.. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. మళ్లీ గెలవగానే రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని.. ఎన్నికలప్పుడు వచ్చి ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మొద్దని హితవు పలికారు.
ఓటు మన తలరాతను మార్చేస్తుంది. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఎంతో బలమైన ఆయుధం మన ఓటు. ఎన్నికలప్పుడు వచ్చి ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మొద్దు. ధరణిని తీసేసి బంగాళాఖాతంలో వేస్తామని విపక్షాలు అంటున్నాయి. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సాగుకు 3 గంటల కరెంట్ చాలంటున్న కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలపాలి. బీఆర్‌ఎస్ మళ్లీ గెలిస్తే.. 93 లక్షల మందికి కేసీఆర్ బీమా అమలు చేస్తాం. మళ్లీ గెలవగానే రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తాం. - సీఎం కేసీఆర్