BJP Speed Up Election Campaign in Telangana : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. సభలు, సమావేశాలతో దూసుకుపోతుంది. బీజేపీ అభ్యర్థుల తరఫున కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగి ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, పీయూష్ గోయల్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ శావంట్, ఖుష్బూ, స్మృతి ఇరానీ, సాధ్వీ నిరంజన్ జ్యోతి ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచార సభల్లో పాల్గొన్నారు. పోలింగ్ సమయం దగ్గర పడటంతో పెద్దఎత్తున ప్రచారం నిర్వహించేందుకు బీజేపీ నాయకత్వం ప్లాన్ చేసింది. మోదీ, అమిత్ షా, నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కేంద్రమంత్రులు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు నేడు రాష్ట్రానికి రానున్నారు.
ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ - డబుల్ ఇంజిన్ సర్కార్ లక్ష్యంగా బీజేపీ ప్రచారం
Amit Shah Jangaon Tour Today : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. బీజేపీ అభ్యర్థుల తరుపున ప్రచారంలో పాల్గొనేందుకు అమిత్ షా మధ్యాహ్నం 12: 25కు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 12: 35 గంటలకు జనగామ బయల్దేరి వెళ్తారు. జనగామలో 1:15 నుంచి 1: 55 వరకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 3 గంటల నుంచి 3:30 గంటల వరకు కోరుట్లలో జరిగే సభలో పాల్గొంటారు. కోరుట్ల సభను ముగించుకుని ఉప్పల్‌కు చేరుకోనున్న అమిత్ షా.. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7 గంటల వరకు బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తరఫున రోడ్ షో నిర్వహిస్తారు. మూడు రోజుల వ్యవధిలోనే అమిత్ షా రెండుసార్లు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు.
ఊపందుకున్న ఎన్నికల ప్రచారం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు
Nitin Gadkari Telangana Tour : కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎల్లారెడ్డి, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ జూబ్లీహిల్స్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధరేశ్వరి మహేశ్వరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేపు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రాజేంద్ర నగర్, హిమాయత్ నగర్, బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్లో నిర్వహించే బిజినెస్ కమ్యూనిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు రాబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే నాలుగు సార్లు రాష్ట్రానికి వచ్చారు. పాలమూరు, నిజామాబాద్ ప్రజాగర్జన సభలతో పాటు హైదరాబాద్‌లో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభ, మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు హాజరయ్యారు.
ఢంకా భజాయించి చెబుతున్నా బీఆర్ఎస్ ఓటమి ఖాయం : ప్రధాని మోదీ
ప్రధాని మూడు రోజుల పర్యటన..: మళ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఈ నెల 24, 25, 27 తేదీల్లో ప్రధాని.. రాష్ట్రానికి రానున్నారు. 24న నిర్మల్, 25న మెదక్, 27న కరీంనగర్ సభతో పాటు హైదరాబాద్‌లో పటాన్‌చెరు నుంచి ఎల్బీనగర్ వరకు నిర్వహించే రోడ్ షోలో పాల్గొననున్నారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారం ఈ నెల 23తో ముగుస్తుండటంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో ఐదు రోజుల పాటు మకాం వేయనున్నారు. పలు సభలు, రోడ్ షోల్లో పాల్గొననున్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తూ.. పార్టీ అభ్యర్థుల విజయానికి సంబంధించిన వ్యూహాలపై రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ బీజేపీ ఛార్జ్‌షీట్
పోలింగ్ సమయానికి మరింత..: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ నెల 24, 25, 26 తేదీల్లో రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 22, 23, 27, 28 తేదీల్లో స్మృతి ఇరానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ నెల 24, 25, 26 తేదీల్లో మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్ తరఫున సభతో పాటు రోడ్ షోలో పాల్గొననున్నారు. నిర్మల్, కరీంనగర్ జిల్లాల్లోనూ ప్రచారం నిర్వహించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వీరితో పాటు మరికొంత మంది కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు ప్రచారపర్వంలో భాగస్వామ్యం కానున్నారు. బీజేపీకి ఒక్క అవకాశమివ్వండి.. అభివృద్ధి చేస్తామంటూ అగ్రనేతలు ప్రజలను కోరుతున్నారు. అగ్రనేతల ప్రచారంతో రెండు, మూడు రోజులుగా బీజేపీ గ్రాఫ్ పెరిగిందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. పోలింగ్ సమయానికి మరింత పుంజుకుని మంచి ఫలితాలు వస్తాయని విశ్వసిస్తోంది.
ఆచితూచి అడుగేస్తున్న విపక్షాలు - ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలుగా ప్రజల్లోకి