కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్ బంద్ జనగామ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. వామపక్ష పార్టీలతో సహా, కాంగ్రెస్, తెదేపా, తెరాస పార్టీలు బంద్కు మద్దతు ఇవ్వడంతో ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు డిపోకు పరిమితం అయ్యాయి. ప్రయాణికులు లేక బస్టాండ్ వెలవెలబోయింది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.
భాజపా మినహా అన్ని పార్టీల నేతలు జిల్లా కేంద్రంలో ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన చౌరస్తా వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ విశ్రాంతి భవనం నుంచి ప్రధాన చౌరస్తా వరకు పెద్ద ఎత్తున తెరాస శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి.
ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ట్రాక్టర్ నడుపుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. కేంద్రం కార్పొరేట్ శక్తులకు లబ్ది చేకూరేలా వ్యవసాయ బిల్లులు తీసుకుని రావడం సరైన పద్ధతి కాదని ఎమ్మెల్యే అన్నారు. వెంటనే రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'సీటు కోల్పోయినందుకు ఆ విద్యార్థినికి రూ.10 లక్షలు చెల్లించండి'