జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొంతగట్టు నాగారం గ్రామానికి చెందిన వసంత, వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన అనిల్ గౌడ్ ఈ యేడు జూన్ 21న కులాంతర వివాహం చేసుకున్నారు. దీనిపై సర్పంచ్ భర్తతో పాటు కొంతమంది కులపెద్దలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతే కాకుండా జూన్ 27న పంచాయితీ పెట్టి.. వసంత కుటుంబానికి లక్ష రూపాయలు, వివాహానికి హాజరైన ఆరుగురు బంధువులకు 5వేల రూపాయలు, కురుమ కుల పెద్దకు 20 వేలు జరిమానా విధించారు.
వసంత తండ్రి జులై 1న 50 వేలు, ఆగస్టు 27న మరో 50 వేలు చెల్లించాడు. అయినా తరచూ తన తల్లిదండ్రులను వేధిస్తున్నారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం నాడు కులస్థులంతా వనభోజనాలకు వెళ్లగా... తమ కుటుంబాన్ని ఆహ్వానించకుండా... కుల బహిష్కరణ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తమ కుటుంబంపై కులపెద్దలు వేధింపులు ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
ఘటనపై విచారణ జరిపి ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తహసీల్దార్ ముందు బైండోవర్ చేసి సొంతపూచికత్తుపై విడుదల చేసినట్లు నర్మెట్ట సీఐ సంతోష్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: గాంధీ ఆస్పత్రిని సందర్శించిన "అఖిలపక్షం" నేతలు