ఒకవైపు ప్రకృతి, మరోవైపు చీడపీడలు పసుపు రైతులను నట్టేట ముంచాయి. అన్నదాతలు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పసుపు పంటకు సరైన ధర లేక... అవస్థలు పడుతున్నారు. పచ్చ బంగారాన్ని నమ్ముకుని సాగు చేస్తే... తీవ్ర నష్టాలు వచ్చి పడ్డాయి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సుమారుగా 36వేల ఎకరాల్లో రైతులు పసుపు సాగు చేశారు. మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో పసుపు పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇక్కడ పండించిన పసుపును మెట్‌పల్లి, నిజామాబాద్, మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో విక్రయిస్తుంటారు. మంచి లాభాలు వస్తాయని రైతులు ఆశిస్తే... ఆశలు అడియాసలయ్యాయి. అధిక వర్షాలు పడటంతో.. పసుపు పంటకు దుంపకుళ్ల్లు, మర్రాకు తెగులు, అడుగు తేగుళ్లు సోకాయి. దిగుబడి పెద్దఎత్తున తగ్గిపోయింది. ఎకరంలో సాధారణంగా 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. కానీ ఇప్పుడు ఎకరానికి 5 నుంచి 10 క్వింటాళ్ల వరకే దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు.
ప్రస్తుతం పసుపు పంటకు క్వింటాకు 7వేలు కూడా పలకడం లేదు. కనీసం క్వింటాకు 15వేలు మద్దతు ధర వస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే.... ఆందోళనకు దిగుతామని పసుపు రైతులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చూడండి: