తెరాస నేత ఎల్.రమణ పార్టీ మారిన తర్వాత తొలిసారిగా జగిత్యాలకు వచ్చారు. జగిత్యాలలోని తెరాస పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రమణను తెరాస నేతలు ఘనంగా సన్మానించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్‌లో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుస్తాడని రమణ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాలని తెరాసలో చేరినట్లు చెప్పారు.
మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా తెరాసలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన నాయకుడిగా... 27 ఏళ్లు ప్రత్యక్ష రాజకీయాల్లో అందరికి అందుబాటులో ఉన్నానన్నారు. ఈటల రాజేందర్ పార్టీ మారి, పార్టీకి ద్రోహం చేశారని విమర్శించారు. రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో తెరాస మూడో సారి అధికారంలోకి రావడానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు.
దాదాపు 40 ఏళ్ల క్రితం కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించాను. తెలంగాణ ఉద్యమ సమయంలో నా వంతు పాత్ర పోషించాను.
-ఎల్.రమణ, తెరాస నేత
ఇదీ చదవండి: KRMB: కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ