జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ బస్టాండ్లోని హోటల్ పైకప్పు అకస్మాత్తుగా పెచ్చులూడి కింద పడింది. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ హోటల్లో లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది. పెచ్చులు ఊడిన స్థలంలో పెద్ద ఎత్తున ఇనుప చువ్వలు బయటకు తేలి ఉన్నాయి. శిథిలావస్థలో ఉన్న భవనం కావడం వల్ల తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం.. ఇది మూడో సారి.
గతంలో రెండు సార్లు జరిగిన ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు అధికారులు హడావుడి చేస్తూ తూతూమంత్రంగా మరమ్మతులు చేస్తుండడం వల్ల తరచూ ఇలాంటి ప్రమాదాలు నెలకొంటున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని ఘోర ప్రమాదం జరగకముందే శిథిలావస్థలో ఉన్న ఈ బస్టాండ్ తొలగించి నూతన భవనాన్ని నిర్మించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్ కేసులు