Pensioners day 2021: అరవై ఏళ్లు వచ్చే వరకు అటు ఉద్యోగ జీవితంలోనూ ఇటు కుటుంబ జీవితంలోనూ తలమునకలై పోతుంటారు ప్రభుత్వ ఉద్యోగులు. వృత్తి ధర్మానికి న్యాయం చేస్తూనే.. ఇంటి బాధ్యతలనూ సక్రమంగా నిర్వర్తిస్తూ సమాజంలో తమ వంతు పాత్ర పోషిస్తారు. ఇక ఇటు కుటుంబ బాధ్యతలు తీరే సమయంలోనే అటు ఉద్యోగ జీవితమూ ముగింపు దశకు వస్తుంది. రెండింటి నుంచీ పదవీ విరమణ పొంది శేష జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని ఆశిస్తారు. ఉరుకులు పరుగుల జీవితం నుంచి బయటపడి తమ తర్వాతి తరాలకు తమ జీవితానుభవాలను తెలియజేస్తూ తమ బాల్యాన్ని నెమరువేసుకుంటుంటారు. ఇది ప్రతీ విశ్రాంత ఉద్యోగి జీవితంలో జరిగే దినచర్యే. కానీ జగిత్యాల జిల్లా మెట్పల్లి విశ్రాంత ఉద్యోగుల సంఘం దైనందిన జీవితం చాలా భిన్నమైనది.
సొంత ఖర్చులతో భవనం ఏర్పాటు
Metpally retired employees association: మెట్పల్లి విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి రోజూ విశ్రాంత ఉద్యోగులు అందరూ ఒకచోట చేరి తమ దైనందిన జీవితాన్ని తమకు నచ్చినట్లుగా మార్చుకుంటున్నారు. నిత్యం ఆటపాటలతో నూతనోత్సాహాన్ని పొందుతున్నారు. అంతే కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వెనక విశ్రాంత ఉద్యోగులు.. 1982లో ఐదుగురు సభ్యులతో సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘాన్ని 500 మందితో నడిపిస్తున్నారు. సుమారు రూ. 29 లక్షలతో నూతన భవనాన్ని నిర్మించి రోజు వారి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
వైద్య పరీక్షలు
ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎప్పుడూ పనుల ఒత్తిడితో నెట్టుకొచ్చే వీరు.. ప్రస్తుతం పదవీ విరమణ పొంది వృద్ధ వయసులోనూ ఉత్సాహంగా గడుపుతున్నారు. నిత్యం ఉదయం రెండు గంటల పాటు కార్యాలయంలో ఉండి సంఘం అభివృద్ధిపై చర్చించుకుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి వరకు ఇలాంటి ఆటలు ఆడుతూ కొందరు పాటలు పాడుతూ, మరి కొందరు కవితలు రాస్తూ.. ఇలా ఎవరికి నచ్చిన పని వారు చేసుకుంటూ వారు బిజీబిజీగా కనిపిస్తుంటారు. కేవలం వీటితోనే ఆగకుండా 4 నెలలకు ఒకసారి నేత్ర పరీక్షలు, గుండె వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ విశ్రాంత ఉద్యోగులు అందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
మా వ్యక్తిగత సమస్యలన్నిటినీ మర్చిపోతూ శేష జీవితాన్ని విశ్రాంత ఉద్యోగులం అందరం కలిసి ఆనందంగా గడుపుతున్నాం. ప్రతి రోజూ 50 నుంచి 60 మంది వరకూ కలుసుకుంటాం. పలు సేవా కార్యక్రమాలతో పాటు స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహిస్తూ సంతోషంగా ఉంటున్నాం. లాఫింగ్ డే లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం. -మెట్పల్లి విశ్రాంత ఉద్యోగులు
సమాజ సేవ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే స్వచ్ఛభారత్, హరితహారం కార్యక్రమాలతో పాటు వివిధ సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ.. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుతున్నారు. ఉద్యోగులు నిర్మించుకున్న ఈ భవనం ప్రహరీ గోడకు వేసిన పలు చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇలా ఆరు పదుల వయసులో ఒకరికొకరు తోడుగా వారి జీవనాన్ని కొనసాగించుకుంటున్నారు ఈ వృద్ధులు.
ఇదీ చదవండి: CM KCR : పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించిన సీఎం కేసీఆర్