Metpally government school: జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం ఇందిరా నగర్లోని మండలపరిషత్ ప్రాథమిక పాఠశాలను ఐదో తరగతి వరకు నిర్వహిస్తున్నారు. ఇందులో మూడో తరగతి వరకు ఆంగ్లంలో బోధన ఉంటే.. 4, 5 తరగతులు తెలుగు మాధ్యమంలో నడుస్తున్నాయి. గతంలో ఈ పాఠశాల కేవలం 22 మంది విద్యార్థులతో ఉండేది. నాణ్యమైన విద్యా బోధన, ఉపాధ్యాయులు ఆసక్తికరంగా పాఠాలు బోధిస్తుండటంతో.. తల్లిదండ్రులు తమ పిల్లలను బడిలో చేర్పించారు. ప్రభుత్వ బడుల్లో విద్యా బోధనపై ఉపాధ్యాయులు స్థానికంగా అవగాహన కల్పించడంతో.. ఈ ఏడాది ఏకంగా విద్యార్థుల సంఖ్య 215 కి చేరింది.
పదేళ్లైనా డబ్బులివ్వలేదు
Lack of facilities in govt schools: ఈ పాఠశాల గతంలో మెట్పల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉండేది. పదేళ్ల క్రితం బడి రైల్వే లైన్లో పోవడంతో రైల్వే శాఖ.. పరిహారం కింద రూ. 10.50 లక్షలు మంజూరు చేశారు. పాఠశాలను అక్కడి నుంచి పట్టణంలోకి తరలించారు. కానీ ఇంతవరకూ ఆ నిధులు స్కూల్ అభివృద్ధికి చేరలేదు. నిధులు రాకపోవడంతో ప్రస్తుతం రెండు గదులతో పాఠశాల నడిపిస్తున్నారు. దీంతో విద్యార్థులు నిత్యం నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 215 మంది విద్యార్థులతో 5 తరగతులను రెండు గదుల్లో నిర్వహించడం కష్టంగా మారింది. సరిపడా స్థలం లేకపోవడంతో విద్యార్థులు పాఠాలు వినలేకపోతున్నారు.
బోధనకు ఆటంకం
పాఠశాలలో ఉన్న రెండు గదుల్లో ఒక గదిలో కార్యాలయం పేరిట సగం వరకు వినియోగిస్తున్నారు. మిగిలిన భాగంలో ఒక తరగతిని నడిపిస్తున్నారు. మరో గదిలో సగం వరకు పాఠశాల సామగ్రి, బియ్యం, బెంచీలు ఉండగా.. మిగతా సగభాగం మరో తరగతిగా నడిపిస్తున్నారు. వరండాలో రెండు తరగతులుగా ఏర్పాటు చేసి విద్యార్థుల మధ్యలో బెంచీలు అడ్డుగోడలుగా ఏర్పాటు చేసి బోధిస్తున్నారు. అన్నీ తరగతులు ఒకే దగ్గర ఉండటంతో పాఠశాల ఆవరణలో గందరగోళం నెలకొనడంతో విద్యార్థులు పాఠాలు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు.
పాఠశాలకు వచ్చిన రూ. పది లక్షల నిధులు.. ఉన్నతాధికారుల ఖాతాల్లో ఉండటంతో వాటిని వినియోగించుకోలేకపోతున్నాం. ఆ డబ్బుల కోసం గత పదేళ్ల నుంచి ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సమస్యను విన్నవించినా ఫలితం లేదు. స్కూల్ ఎదురుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. ప్రహరీ గోడ లేకపోవడంతో కార్యాలయానికి వచ్చిన వారంతా వాహనాలకు బడి ఆవరణలో పెడుతున్నారు. దీనికి తోడు పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. -వేణు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు
ఆవరణలోనే వంటలు
మధ్యాహ్న భోజనం కోసం వంటగది లేక ఆరుబయటే నిర్వాహకులు భోజనం వండుతున్నారు. చిన్న చినుకు పడినా చాలు వంట చేయడానికి నిర్వాహకులు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమస్యల మధ్య సర్కారు బడి కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు పట్టించుకొని పాఠశాలకు కావలసిన సౌకర్యాలను కల్పించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: Justice Chandru on CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్పై జస్టిస్ చంద్రు కీలక వ్యాఖ్యలు