జంబుక స్వప్నది.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామం. రెండేళ్ల క్రితం తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. ఎవరూ లేకపోయినా.. ఆత్మస్థైర్యంతో బతికింది. కూలీనాలీ చేసుకుంటూ పొట్ట పోసుకుంది. ఏం ఆగినా.. కాలం ఆగదు కదా! స్వప్నకు పెళ్లీడు వచ్చింది. పెళ్లి కుదిరింది. పెళ్లి సంబంధం అయితే కుదిరింది కానీ.. పెళ్లి చేసే పెద్దలెవరు?
ఈ సమయంలోనే.. స్నేహాలయ యూత్ సభ్యులు మేమున్నామంటూ ముందుకు వచ్చారు. మానవత్వం.. మంచితనం అనే మాటలకు జీవం పోశారు. పెళ్లికి కావాల్సిన ఖర్చును అందరూ కలిసి జమచేశారు. పెళ్లి ఖర్చు, ఇతిర వస్తువులు, లాంఛనాలు, భోజనాలు అన్నీ సిద్ధం చేశారు. బంధువులకు ఏ లోటుపాట్లు లేకుండా చూసుకున్నారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూనే.. స్వప్న పెళ్లి చేశారు. మాస్కులు, శానిటైజర్లు అన్నీ అందుబాటులో ఉంచారు. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన పెళ్లికి చుట్టాలు, ఊరి ప్రజలు అందరూ హాజరై వధూవరులను పెద్ద మనసుతో ఆశీర్వదించారు. భౌతిక దూరం పాటిస్తూ.. స్నేహాలయ యూవజన సంఘం చేసిన మంచిపని గురించి ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ మాట్లాడుకుంటున్నాయి. అమ్మానాన్నల స్థానంలో నిలబడి తన పెళ్లి చేసిన స్నేహాలయ యూత్ సభ్యులే.. నాకు ఆత్మబంధువులు అంటూ స్వప్న కన్నీళ్లు పెట్టుకున్నది.
ఇదీ చూడండి: ఈ బాధ ఏ తల్లికి రావొద్దు.. రిక్షాపై తీసుకెళ్లి అంత్యక్రియలు