Pawan Kalyan Visited Dharmapuri Temple : జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామివారిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన పవన్‌ను పండితులు వేదమంత్రాలతో స్వాగతించారు. ముందుగా యమధర్మరాజును దర్శించుకున్న జనసేనాని.. అనంతరం ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశీర్వచన మండపంలో పవన్‌ను అర్చకులు ఆశీర్వదించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. దర్శనానంతరం అనుష్టుప్ నారసింహ యాత్రకు పవన్ శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా 31 నారసింహ క్షేత్రాలను ఆయన దశల వారీగా సందర్శించనున్నారు. ధర్మపురిలో దర్శనం అనంతరం ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.
అంతకుముందు కరీంనగర్ జిల్లా గంగాధరలో పవన్‌కల్యాణ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. గంగాధర కూడలిలో భారీ గజమాల వేసి సత్కరించారు. పవన్‌తో కరచాలనం చేసేందుకు అభిమానులు, స్థానికులు పోటీపడ్డారు. తన కోసం వచ్చిన వారి కోసం అభివాదం చేస్తూ పవన్ ముందుకు కదిలారు.
కొండగట్టులో వారాహికి ప్రత్యేక పూజలు..: ధర్మపురి నరసింహస్వామి దర్శనానికి ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన ప్రచార రథం 'వారాహి'కి వేద పండితులతో శాస్త్రోక్తంగా పూజలు చేయించిన తర్వాత దానిని ఆయన ప్రారంభించారు. పవన్‌ను చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు కొండగట్టుకు భారీగా తరలివచ్చారు. గజమాలతో ఆయనను సత్కరించారు. అభిమానులకు ఓపెన్‌టాప్ వాహనం నుంచి పవన్ అభివాదం చేశారు.
పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు..: కొండగట్టులో మాట్లాడిన పవన్ వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓట్లు చీలకూడదు అన్నదే తన అభిప్రాయమని పేర్కొన్నారు. బీజేపీతో ఇప్పటికే పొత్తులో ఉన్నామన్న పవన్.. ఆ పార్టీ కాదంటే ఒంటరిగా వెళ్తామని తెలిపారు. కొత్త పొత్తులు వస్తే ఆ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామన్న ఆయన.. ఎన్నికల ముందు పొత్తులపై స్పష్టత వస్తుందని చెప్పారు. అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు.
పవన్ పర్యటన నేపథ్యంలో కొండగట్టు, ధర్మపురి ఆలయ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పవన్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు.
సంబంధిత కథనాలు..
- వచ్చే ఎన్నికల్లో పొత్తులపై అప్పుడే స్పష్టత వస్తుంది: పవన్‌కల్యాణ్
- కారు టైర్ పంక్చర్ 15 నిమిషాల పాటు రోడ్డుపైనే వెయిట్ చేసిన పవన్
- తెలంగాణలో జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే: పవన్‌కల్యాణ్
ఇవీ చూడండి..
ఆస్కార్ బరిలో 'నాటు నాటు'.. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్.. పూర్తి జాబితా ఇదే..
120 గంటలపాటు తబలా వాయించి ప్రపంచ రికార్డు.. గిన్నిస్ బుక్‌లో చోటు కోసం..