జగిత్యాల జిల్లా కేంద్రంగా మారిన తర్వాత నిర్మాణ రంగం శరవేగంగా సాగుతోంది. పట్టణంలో లక్షా 30 వేలకు పైగా జనాభా ఉండగా.. రోజురోజుకూ పట్టణానికి వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకు తగ్గట్లు నిర్మాణాలు కూడా పెరిగాయి. అయితే ప్రతి భవన నిర్మాణ అనుమతి కోసం టీఎస్‌బీపాస్ ద్వారా ఆన్‌లైన్‌లోనే అనుమతులు పొందాల్సి ఉండగా ఇక్కడ మాత్రం అవేమి పని చేయవు. అనుమతుల కోసం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాలి. ప్రతి పనికి ఇంతా అనే రీతిలో ముడుపులు చెల్లిస్తేనే పనులు జరుగుతాయని ఆరోపణలు తీవ్రమయ్యాయి.
అనుమతులే కాదు..
కేవలం భవన నిర్మాణ అనుమతులే కాదు.. ప్రతి ఫైలుకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే. నాలుగు రోజుల క్రితం పట్టణానికి చెందిన బత్తుల రామయ్యను.. భవన నిర్మాణ అనుమతి కోసం అధికారులు రూ. లక్ష డిమాండ్ చేశారు. అతని నుంచి లంచంగా రూ. 95 వేలు మున్సిపల్ కార్యాలయంలోనే తీసుకుంటూ టీపీఎస్ బాలనందస్వామి, సివిల్ ఇంజినీర్ నాగరాజు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాము ఎసీబీకి చిక్కారు. కార్యాలయంలోనే లంచం తీసుకుంటూ దొరకటంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇంత అవినీతి మునుపెన్నడూ లేదని ప్రతిపక్షానికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.
టెండర్లనూ వదలడం లేదు
టెండర్లలోనూ ఈ తరహా అక్రమాలు దర్శనమిస్తున్నాయి. సింగిల్ టెండర్లు వేస్తూ రింగుగా మారటం.. పనుల్లో నాణ్యతా లోపం.. తాత్కాలిక ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు, పాలక మండలి ప్రజా సమస్యల కోసం పాటుపడాలని ప్రజలు కోరుతున్నారు. అంకిత భావంతో పని చేయాలని ఆశిస్తున్నారు.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ