జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 6 వేల మంది వరకు కూలీలు పనుల్లో ఉన్నారు. రెండో వారంలో కూలీల సంఖ్య 12 వేలు, ఏప్రిల్ 28 నాటికి ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య 35,832కు చేరింది. కరోనా వైరస్ కారణంగా మొదట్లో ఉపాధి పనులకు రావడానికి ప్రజలు వెనుకంజ వేయగా, జిల్లా పాలనాధికారి రవి దిశానిర్దేశం, గ్రామాల్లో కూలీలకు అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించి ఉపాధి పనులకు వచ్చే వారి సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకున్నారు.
ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే రోజు వారీ వేతనాన్ని రూ.237కు పెంచుతూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా జిల్లాలో 50వేల మంది ఉపాధి పథకం ద్వారా పనుల పొందుతున్నారు. ఈ ఏడాది 55వేల మంది కూలీలకు ఉపాధి కల్పిస్తామని, వ్యవసాయ ప్రాధాన్యం గల జిల్లా కావడంతో ఉపాధి పనులపై అంతగా ఆసక్తి చూపడంలేదని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో మొత్తం 18 మండలాల్లోని 380 గ్రామ పంచాయతీల్లో పథకం అమలవుతుండగా మొత్తం జాబ్ కార్డులు 1,39,130 ఉండగా ఇందులో 2,56,968 మంది కూలీలు ఉన్నారు.
ఉపాధి పనులు ఊపందుకుంటున్నాయి
జిల్లాలో ఉపాధి పనులు ఊపందుకుంటున్నాయి. అడిగిన వారందరికీ పనులు కల్పిస్తున్నారు. ఈ ఏడాది 55 వేల మంది కూలీలకు ఉపాధి కల్పించడానికి కృషి చేస్తున్నాం. కొత్తగా కార్డు కావాలనుకునే వారు ఎంపీడీవోకు దరఖాస్తు చేసుకోవాలి. కూలీలు మాస్కులు ధరించేలా, ఎడంగా ఉంటూ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం.
- సుందర వరదరాజన్, ఏపీడీ