జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని సూరమ్మ జలాశయం పరిశీలనకు వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని జగిత్యాలలో పోలీసులు అడ్డుకున్నారు. తన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరు పట్ల జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టుల పట్ల తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వెళ్తున్న తమను అడ్డుకోవడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఉంటే.. బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ ప్రాంతాలు సస్యశ్యామలం అయ్యేవని ఆవేదన వ్యక్తం చేశారు. సూరమ్మ జలాశయానికి శంకుస్థాపన చేసి రెండేళ్లు గడుస్తున్నా తట్టెడు మట్టి కూడా తీయలేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.