అభివృద్ధిలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రాన్ని అస్థిర పరిచే ప్రయత్నం జరుగుతోందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వ్యవసాయాన్ని పరాధీనం చేసేందుకు నూతన సాగు చట్టాలను ప్రవేశపెట్టారని విమర్శించారు. విద్యుత్తును ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం నూతన బిల్లును ముందుకు తీసుకు వచ్చిందన్నారు. సన్నరకం వరి ధాన్యానికి ధర పెంచొద్దని కేంద్రం ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిందన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిరుమలాపూర్ రైతువేదికను రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు.
కరెంట్, వ్యవసాయ చట్టాలపై ఏమాత్రం స్పందించని భాజపా ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్.. రాష్ట్ర ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నిరోజులు ఇలా అసత్య ప్రచారంతో పబ్బం గడుపుతారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చోటుచేసుకుందన్న వారి విమర్శల్లో వాస్తవం లోపించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు రైతులు, మహిళలు, యువకులు స్పందించాలని కోరారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జగిత్యాల కలెక్టర్ గూగులోతు రవి, స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఫేస్బుక్లో మొదట స్నేహం తర్వాత వేధింపులు... ఓ వైద్యుడి నిర్వాకం